జానీ మాస్టర్ ది `లవ్ జిహాద్’ కేసు

జానీ మాస్టర్ ది `లవ్ జిహాద్’ కేసు
 
* కేసును నీరుగార్చే యత్నం.. మహిళా మోర్చా హెచ్చరిక
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతి (అసిస్టెంట్ కొరియోగరాఫర్)పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా ( జానీ మాస్టర్ ) లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా పేర్కొంటూ ఇది లవ్ జిహాద్ కేసు అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి స్పష్టం చేశారు. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. 
 
హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఉన్నాడని తెలిసి కూడా ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గం అంటూ ఆమె మండిపడ్డారు. ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లోబరచుకొని, మతం మార్చే యత్నాలు రాష్ట్రంలో పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు, హిందూ మహిళలను మతం మార్చి లైంగికంగా వేధించే ఘటనలు తీవ్రమైనా రాష్ట్ర ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించకపోవడం సిగ్గుచేటని డా. శిల్పా రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొంటూ దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. 
 
రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖపై ఒక్కసారి కూడా సమీక్షించలేకపోవడంతో శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారిందని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆమె తెలిపారు.  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై వేధింపులకు, లవ్ జిహాదీ చర్యలకు పాల్పడిన షేక్ జానీపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారని ఆమె గుర్తు చేశారు. 
 
తాజాగా మరోసారి మహిళా డ్యాన్సర్ పై, మైనర్ గా ఉన్నప్పటి నుంచీ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కేసును చులకనగా తీసుకోవడాన్ని బిజెపి మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాగం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ  ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ కేసును విచారణను జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేనిపక్షంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పా రెడ్డి హెచ్చరించారు .
కాగా, జానీ మాస్టర్ వివాదం రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంని, తామే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరామని  టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ తెలిపింది. పోలీసుల విచారణ, మా విచారణ సమాంతరంగా జరుగుతుందని పేర్కొంటూ మూడు నెలలలోపే ఈ కేసుపై ఓ స్పష్టత వస్తుందని వారు చెప్పారు. .
 
“పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత బాధితురాలు ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. అప్పటి దాకా కాస్త సంయమనం పాటించాలి. ప్రభుత్వం తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ నిమిత్తం సరైన గైడ్‌లైన్స్ లేవు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఒక కమిటీ ఫామ్ అయింది. అప్పటి నుంచి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉన్నాం” అని ఝాన్సీ తెలిపారు.