రాహుల్‌ వ్యాఖ్యలకు ఉగ్రవాది పన్నూ మద్దతు

రాహుల్‌ వ్యాఖ్యలకు ఉగ్రవాది పన్నూ మద్దతు
 
* రాహుల్ ఇంటివద్ద సిక్కుల నిరసన
 
‘భారత్‌లో ఓ సిక్కు టర్బన్‌, కడెం ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందా? అనే దానిపై పోరాటం జరుగుతున్నది’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ సమర్థించారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం రాహుల్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందించిన పన్నూ.. భారత్‌లో సిక్కులకు ఉన్న ముప్పుపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ధైర్యంతో, మార్గదర్శకంగా చేసినట్టు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో 1947 నుంచి సిక్కులు ఎదుర్కొంటున్న వాస్తవిక పరిస్థితులను చాటేలా రాహుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, తమ ఖలిస్థాన్‌ ఏర్పాటు డిమాండ్‌ను సమర్థిస్తున్నాయని తెలిపారు. 
 
కాగా, రాహుల్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద సిక్కులు ఆందోళనకు దిగారు. సిక్కు సమాజ స్థితిగతులపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన సిక్కులను పోలీసులు నియంత్రించారు.
 
రాహుల్‌ గాంధీ అమెరికాలో చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ అనుబంధ సిక్కు సంఘాలు బుధవారం నిరసన చేపట్టాయి. ఢిల్లీలోని జనపథ్‌ రోడ్డులో ఉన్న రాహుల్‌ గాంధీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో సిక్కులు తరలివచ్చారు. విదేశాలకు వెళ్లిన ఆయన సిక్కుల పరువు తీయడం ఎందుకని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ సిగ్గుపడాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.