గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ

గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ

గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ తగిలింది. నైరోబిలోని విమానాశ్రయ కాంట్రాక్టు తాత్కాలికంగా ఆగిపోయింది. కెన్యా ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ మధ్య జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ ఆధునీకరణ, అభివృద్థి కోసం ఇటీవల ఒప్పందం కుదిరింది.  బిల్డ్‌ అండ్‌ ఆపరేట్‌ విధానంలో జరగనున్న ఈ కాంట్రాక్టు ఒప్పందం కింద ఎయిర్‌పోర్టు 30 ఏళ్ల పాటు అదానీ గ్రూప్‌ నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించింది.

ఇందులో భాగంగా అదానీ కంపెనీ ఎయిర్‌ పోర్టులో అత్యాధునిక సౌకర్యాలు, అదనపు రన్‌వే, టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉంది.  1.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.15,530 కోట్లు) విలువ చేసే ఈ ఒప్పందాన్ని సవాలు చేస్తూ కెన్యా మానవ హక్కుల కమిషన్‌, న్యాయవాదుల సంఘం కోర్టును ఆశ్రయించాయి. తూర్పు ఆఫ్రికాలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్థి, నిర్వహణను అదానీకి అప్పగించడాన్ని కెన్యా ఎయిర్‌పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. 

అదానీకి ఎయిర్‌పోర్ట్‌ను అప్పగిస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదానీతో చేసుకున్న ఒప్పందంలోని నియమ. నిబంధనలు కెన్యాకు ప్రతికూలంగా ఉన్నాయని ఆ యూనియన్‌ పేర్కొంది. అదానీ గ్రూప్‌తో మిగిలిన చర్చలను విరమించుకోవాలని గత వారమే ఆ యూనియన్‌ స్పష్టం చేసింది. లేకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించింది. 

అయినప్పటికీ కెన్యా ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా ఆందోళనలను ఉదృతం చేశారు. ఈ ఒప్పందం సహేతుకం కాదని.. ఉద్యోగాలు పోతాయని.. ప్రజల్లో అసమానతలను పెంచతాయని.. పన్ను చెల్లింపుదారుల డబ్బుకు విలువ ఉండదని అక్కడి సంఘాలు వాదిస్తున్నాయి. కెన్యా ప్రభుత్వమే స్వయంగా ఎయిర్‌పోర్టును అభివృద్థి చేయవచ్చని సూచిస్తున్నాయి.

కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగ, కార్మికుల సమ్మెతో విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొందని కెన్యా ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ తన ప్రధాన విమానాశ్రయాన్ని 30 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు అనుమతించే ఒప్పందాన్ని కెన్యా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. లాసొసైట్‌, కెన్యా మానవ హక్కుల కమిషన్‌ దాఖలు చేసిన కేసు విచారణ జరిగే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీనిపై అదానీ గ్రూపు వర్గాలు స్పందించాల్సి ఉంది.