హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలకు హైకోర్టు అనుమతి

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్‌ దాఖలు చేశారు. 

హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్‌.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్‌ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.  నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. మరవైపు కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. 

ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందిస్తూ ట్యాంక్‌ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో కొంత గందరగోళం కనిపిస్తోందని తెలిపారు. “దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఒక్కటే కోరుతున్నాను. ఈ విషయంపై స్పష్టత ఇవ్వండి. గణేష్‌ నిమజ్జనాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించండి” అని ట్విట్టర్‌ వేదికగా కోరారు.