గణేష్ నిజమజ్జనం అంటేనే గుర్తుకువచ్చేది హుస్సేన్‌సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేషుడి నుంచి గల్లీల్లో ఏర్పాటు చేసే చిన్నచిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్‌లోనే నిమ్మజ్జనం చేస్తుంటారు. ఇప్పుడు ఆ ఆనవాయితీకి ఈ సారి తిలోదకాలు ఇవ్వనున్నారు.
ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ అందులో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎవరు పెట్టారనే విషయంపై స్పష్టత రాలేదు.
ఈనెల 7న వినాయక మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించగా.. 3 రోజుల పాటు పూజలు నిర్వహించిన కొందరు గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈనెల 17న మహా నిమజ్జనం ఉండగా.. కొందరు 3, 5, 7 రోజుల్లోనే గణపయ్యలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు.
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. అంతకు ముందుగా ఈ ఫ్లెక్సీలు రావడం గమనార్హం. సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో (పిఒపి) తయారుచేసిన విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడంలేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన