
రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఒడిశాలోని పారాదీప్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరువాన పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి.
నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోనసీమ నది పాయల్లో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసహరించారు. ఈ క్రమంలోనే అధికారులు 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
దీంతో బ్యారేజీ దిగువ ఉన్న వశిష్ట, వైనతేయ గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నది పాయలు వరద ప్రవాహంతో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కోనసీమలోని లంక గ్రామాలైన కనకయ్యలంక, జి.పెదపూడి లంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, అయోధ్యలంక, ఆనగార్లంక, పెదమల్లలంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
More Stories
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఈనెల 22న బీజేపీ రాష్ట్ర వ్యాప్త సంబరాలు