పిసిసి అధ్యక్షుడి నీయమకంలో రేవంత్ రెడ్డి మాటే!

పిసిసి అధ్యక్షుడి నీయమకంలో రేవంత్ రెడ్డి మాటే!
లోక్ సభ ఎన్నికలలో అనుకున్న విధంగా పార్టీకి విజయాలు చేకూర్చలేక పోవడంతో పార్టీ అధిష్టానం వద్ద పట్టు కోల్పోయిన్నట్లు భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా తాను సూచించిన ఎమ్యెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను నీయమింప చేయడం ద్వారా తన పట్టు నిలబెట్టుకున్నట్లయింది. 

మహేష్ గౌడ్ నియామకంపై నిర్ణయం తీసుకొని రెండు వారలైన్నప్పటికీ అధికారికంగా ప్రకటించడంలో జాప్యం జరగడం  గమనిస్తే ఈ పదవి కోసం కాంగ్రెస్ నేతలలో పెద్దఎత్తున వత్తిడులు ఎదురైన్నట్లు స్పష్టం అవుతుంది.  కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి తనకు అండగా ఉంటూ వస్తున్న మహేష్ గౌడ్ పట్ల మొదటి నుండి రేవంత్ మొగ్గు చూపుతూ వస్తున్నారు. 

ఈ పదవికి పోటీ పడిన మ‌ధుయాష్కీ గౌడ్ కూడా తన మద్దతుదారుడైన్నప్పటికీ అధిష్టానం వద్ద పలుకుబడి గల ఆయనను నియమిస్తే భవిష్యత్ లో తనకు పోటీదారుడు కావచ్చని వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది. ఇక జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ వంటి వారు కూడా తీవ్రంగా  పోటీ ప‌డ్డారు.

తెలంగాణాలో బిజెపి బలం పుంజుకొంటున్నట్లు లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఈ పరిణామంతో కలవరం చెందుతున్న కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రికి పోటీ కేంద్రంగా వ్యవహరించే వ్యక్తికి పిసిసి నాయకత్వం అప్పచెపేందుకు భయపడినట్లు కనిపిస్తున్నది. 

పరోక్షంగా ప్రస్తుత పరిస్థితులలో రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం తప్ప గత్యంతరం లేదనే సంకేతం పార్టీలో ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తున్న పార్టీ సీనియర్ నాయకులకు ఇచ్చిన్నట్లయింది. విద్యార్థి దశ నుండి మహేష్ గౌడ్ కాంగ్రెస్ లో ఎదుగుతూ వస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. 

రెండు సార్లు ఎమ్యెల్యేగా పోటీ చేసినా గెలుపొందలేదు. మొన్నటి ఎన్నికల్లో నిజామాబాదు రురల్ నుండి పోటీకి సిద్దపడగా, ఆ సీటును సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అందుకనే పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్యెల్సీగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. 

2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుల‌య్యారు. 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల‌య్యారు.