సగానికి పైగా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకే

సగానికి పైగా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకే
ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్ర స్థానంలో నిలిచిందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. ఈ కాలంలో దేశానికి తరలివచ్చిన ఎఫ్‌డీఐల్లో మహారాష్ట్ర ఏకంగా 52.46 శాతం పెట్టుబడులను రాబట్టిందని తెలిపారు.
 
దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల్లో రాష్ట్రానికి 52.46 శాతం పెట్టుబడులు వచ్చాయని కంగ్రాచ్యులేషన్స్‌ మహారాష్ట్ర అని ఫడ్నవీస్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.  ఈ క్వార్టర్‌లో దేశానికి మొత్తం రూ. 1.34,959 కోట్ల పెట్టుబడులు రాగా, మహారాష్ట్రకే ఏకంగా రూ. 70.795 కోట్లు తరలివచ్చాయని ఫడ్నవీస్‌ వివరించారు. 
 
గత రెండేండ్లుగా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ముందున్న మహారాష్ట్ర ఈ ఏడాది ఏప్రిల్ జూన్‌ మధ్య రూ. 70.795 కోట్ల విదేశీ పెట్టుబడులను రాబట్టిందని తెలిపారు. మహారాష్ట్ర తర్వాత రూ. 19.059 కోట్ల పెట్టుబడులతో కర్ణాటక నిలవగా, ఢిల్లీ రూ. 10795 కోట్లతో మూడో స్ధానంలో, తెలంగాణ రూ. 9023 కోట్లతో నాలుగో స్ధానంలో నిలిచిందని చెప్పారు.గుజరాత్‌ రూ. 8508 కోట్ల పెట్టుబడులతో టాప్‌ 5లో నిలిచింది. ఇక తమిళనాడు రూ. 8325 కోట్లతో ఆరో స్ధానంలో, రూ. 5815 కోట్ల పెట్టుబడులతో హరియాణ ఏడో స్దానంలో ఉంది. ఇక యూపీ ఈ కాలంలో రూ. 370 కోట్లు, రాజస్ధాన్‌ రూ 311 కోట్లతో తొమ్మిదో స్ధానంలో నిలిచింది. 2022-23లో మహారాష్ట్ర రూ. 1,18,422 కోట్ల పెట్టుబడులను రాబట్టి ముందువరసలో నిలిచిందని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల మొత్తం కర్నాటక, ఢిల్లీ, గుజరాత్‌ ఉమ్మడిగా ఆకర్షించిన పెట్టుబడుల కంటే అధికమని ఆయన వివరించారు.