మొబైల్‌ ఫోన్లతో బ్రెయిన్‌ క్యాన్సర్‌ ముప్పు పెరగదు

ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ రోజులో ఎక్కువ గంటలు మొబైల్‌ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వారెంతో మంది. మొబైల్‌ ఫోన్ల విపరీత వాడకంతో ఎన్నో దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అయితే మొబైల్‌ ఫోన్ల వాడకం గురించి తాజా అధ్యయనం వివరాలు కాస్త ఉపశమనం కలిగించేలా ఉన్నాయి.

మొబైల్‌ ఫోన్లతో బ్రెయిన్‌ క్యాన్సర్‌ ముప్పు పెరగదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.  మొబైల్‌ ఫోన్లు, బ్రెయిన్‌ క్యాన్సర్‌ మధ్య ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమీక్షా వెల్లడించింది.  గత కొద్ది దశాబ్ధాలుగా మొబైల్‌ ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగినా అదే స్ధాయిలో బ్రైన్‌ క్యాన్సర్ల కేసులు పెరగలేదని పేర్కొంది.

పదేండ్లకు పైగా మొబైల్‌ ఫోన్లు వాడుతున్న వారు, మొబైల్‌ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేవారిలోనూ బ్రెయిన్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరగలేదని గుర్తించారు. 1994, 2022 మధ్య న్విహించిన 63 అధ్యయనాలను ఈ సమీక్ష పరిశీలించింది.  ఆస్ట్రేలియా ప్రభుత్వ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ నిపుణులు సహా పది దేశాల నుంచి 11 మంది పరిశోధకులు ఈ రీసెర్చ్‌ను చేపట్టారు. మొబైల్‌ ఫోన్లు, టీవీలు, బేబీ మానిటర్స్‌, రాడార్‌ వంటి పరికరాల్లో ఉపయోగించే రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ప్రభావాలపై ఈ రివ్యూ ప్రధానంగా దృష్టిసారించింది. 

ఈ అధ్యయనంలో మొబైల్‌ ఫోన్ల వాడకానికి, బ్రెయిన్‌ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం వెల్లడికాలేదని అధ్యయన సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ అక్లాండ్‌, న్యూజిలాండ్‌ క్యాన్సర్‌ ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్‌ మార్క్‌ ఎల్వుడ్‌ తెలిపారు. ఇక ఇతర రకాల క్యాన్సర్‌లకు సంబంధించిన అధ్యయనం వేరొక నివేదికలో పొందుపరిచామని చెప్పారు.