30 ఏళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది అరెస్ట్‌

30 ఏళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది అరెస్ట్‌

ముప్పయ్యేళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది షబ్బీర్‌ అహ్మద్‌ షా అరెస్టయ్యాడు. ఎన్‌ఐఏ అధికారులు అతడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితుడిని పటియాలా హౌస్‌ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి మూడు రోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌ విధించింది. రిమాండ్‌ ముగిసిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోపు కశ్మీర్‌లోని ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ముందు హాజరుపర్చాలని న్యాయమూర్తి ఎన్‌ఐఏ అధికారులను ఆదేశించారు.

షబ్బీర్‌ అహ్మద్‌ షాపై 1996 జూలై 17న కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి నిందితుడు పోలీసులకు చిక్కుకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో కేసు మరుగున పడిపోయింది. అయితే ఈ నెల 1న ఎన్‌ఐఏ అధికారులు కేసును తిరిగి తెరిచారు. ఆపై నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 1996 జూలై 17న భద్రతాబలగాల ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది అంత్యక్రియలు జరిగాయి.

ఈ అంత్యక్రియల సందర్భంగా కాశ్మీరీ వేర్పాటువాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. బాంబులు విసిరి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో షబ్బీర్‌తోపాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. మిగతావాళ్లు అరెస్టయినా షబ్బీర్‌ తప్పించుకుతిరుగుతున్నాడు. తాజాగా అతడు కూడా దర్యాప్తు అధికారులకు చిక్కాడు.