‘అపరాజిత’ బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

పశ్చిమబెంగాల్‌లో ట్రయినీ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన ‘అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
 
బిల్లును ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మోలాయ్ గాటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి, మహిళలు, పిల్లల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా బంగాల్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. పెరోల్‌ లేకుండా దోషులకు జీవితకాల కారాగార శిక్ష విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.
 
ఇది ‘చరిత్రాత్మిక బిల్లు’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అత్యాచారం, లైంగిక నేరాలపై కొత్త ప్రొవిజన్స్‌తో రూపొందించిన ఈ బిల్లు మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని ఆమె చెప్పారు.   బిల్లుపై చర్యలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, అత్యాచారాలు మానవత్వానికి మాయని మచ్చ అని, అలాంటి నేరాలకు అట్టుకట్ట వేసేందుకు సామాజిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.  
 
“ఈ రోజు మేం ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలి. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది. ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సత్వర విచారణ, బాధితులకు న్యాయం అందించడం ఈ బిల్లు లక్ష్యం. ఒకసారి ఈ బిల్లు పాస్‌ అయితే ప్రత్యేక అపరాజిత టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తాం” అని తెలిపారు మమత.
 
 సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నామని, దోషులకు మరణశిక్ష విధించాలని తాము కోరుతున్నామని ఆమె చెప్పారు. ‘అపరాజిత’ బిల్లుతో సత్వర విచారణ, బాధితులకు న్యాయ లభిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.  కోల్‌కతా ట్రయినీ డాక్టర్ మృతికి నివాళి అర్పించారు.
 
ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలో ఉన్న లొసుగులను సరిదిద్దే ప్రయత్నం చేశామని మమతా బెనర్జీ తెలిపారు. ఈ అపరాజిత బిల్లుపై ఆమె అసెంబ్లీలో మాట్లాడుతున్న  సమయంలో, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ‘‘మీరు నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నందున ప్రధానికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నేను నినాదాలు చేస్తే ఎలా ఉంటుంది?’’ అని బెంగాల్ సీఎం ప్రశ్నించారు.
 
“అత్యాచారం వంటి చర్యలు మానవాళికి ఒక శాపాలు. అలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాలి. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. ఉన్నావ్‌, హాథ్రస్‌ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బంగాల్​లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుంది.  మహిళ రక్షణ కోసం సమర్థమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు మమత.
 
కాగా, బిల్లుకు ప్రధాన విపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించింది. లా కమిటీ వద్దకు బిల్లు వెళ్లిందో లేదో తమకు తెలియని, అయితే బిల్లు తక్షణం అమలు కావాలని తాము కోరుతున్నామని, తక్షణ ఫలితాలు ఆశిస్తున్నామని, బిల్లుకు తమ మద్దతు ఉంటుందని అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి చెప్పారు.