పెండింగ్ కేసులను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. భారత్ మండపంలో ఆదివారం జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సులో పాల్గొంటూ ఈ ప్రణాళికలో మూడు ప్రధాన దశలు ఉన్నాయని చెప్పారు. తొలి దశలో జిల్లాస్థాయిలో కేసుల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలిపారు.
పెడింగ్‌లో ఉన్న కేసులు, రికార్డుల స్థితిగతులను కమిటీలు పరిశీలిస్తాయని, రెండో దశలో పది నుంచి 30 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరిస్తారని, మూడో దశలో పదేళ్లకుపైగా ఉన్న కేసులను జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు విచారిస్తారని వివరించారు. ఈ సందర్భంగా సాంకేతిక, డేటా నిర్వహణ వ్యవస్థలు అవసరమని చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడానికి ఇతర చర్యలు, వివాదాలను పరిష్కరించడానికి చొరవ తీసుకోనున్నట్లు చంద్రచూడ్ తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు తొలిసారిగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించి ఇందులో వెయ్యి కంటే ఎక్కువ కేసులను పరిష్కరించిందని ఆయన గుర్తు చేశారు.
సీజేఐ మాట్లాడుతూ జిల్లా కోర్టుల్లో కేవలం 6.7శాతం మౌలిక సదుపాయాలు మాత్రమే స్నేహపూర్వకంగా ఉన్న పరిస్థితిని మార్చాలని స్పష్టం చేశారు. కోర్టులో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు తదితరాలను ఆడిట్ చేయడంతోపాటు ఈ-సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ పరికరాల వినియోగాన్ని పెంచామని తెలిపారు.
మన కోర్టులు సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, వికలాంగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాలకు సురక్షితంగా, స్నేహపూర్వకంగా ఉండేలా చూసుకోవాలని చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయ అధికారుల ఎంపిక పక్రియను క్రమబద్దీకరించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో న్యాయమూర్తులను జాతీయ స్థాయిలో ఎంపిక చేయాలని ఆయన సూచించారు.
“జిల్లా స్థాయిలో న్యాయ సిబ్బంది ఖాళీలు 28 శాతం, నాన్ జ్యుడీషియల్ సిబ్బంది ఖాళీలు 27.5 శాతంగా ఉన్నాయి. కేసుల పరిష్కారం ఎక్కువగా ఉండాలంటే కోర్టులు 71 శాతం నుండి 100 శాతం మేరకు సామర్థ్యానికి మించి పని చేయాలి. ఖాళీలను భర్తీ చేయడానికి, న్యాయమూర్తుల ఎంపిక, అన్ని ఖాళీల కోసం రిక్రూట్మెంట్ క్యాలెండర్లను ప్రామాణీకరించడానికి సంబంధించిన ప్రమాణాలపై సమావేశం చర్చించింది” అని చంద్రచూడ్ తెలిపారు.
న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి తల్లి పిలుస్తారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం మనకు గర్వకారణమని చెబుతూ నేడు న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న గొప్ప వ్యక్తులందరికీ ఒకే ఒక లక్ష్యం ఉందని తెలిపారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం