ఢిల్లీ వక్స్ బోర్డ్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఉదయం ఆయన నివాసానికి ఈడీ టీమ్ చేరుకుంది.
ఈడీ సిబ్బంది తన ఇంటికి చేరుకోగానే తనను అరెస్టు చేసేందుకే అధికారులు వచ్చినట్టు అమానతుల్లా ఖాన్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తనను అరెస్టు చేసి, ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవడమే సెంట్రల్ ఏజెన్సీ ఉద్దేశమని పేర్కొంటూ తనపై ఈడీ తప్పుడు కేసులు బనాయించినట్టు ఆరోపించారు.
ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ కేసులో ఖాన్‌కు జారీ చేసిన సమన్లను పాటించనందుకు ట్రయల్ కోర్టులో ఖాన్‌పై పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్‌లను నిలిపివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన వారాల తర్వాత ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.
ఈ కేసులో చివరిసారిగా ఏప్రిల్‌లో ప్రశ్నించబడినప్పటి నుండి ఖాన్ కనీసం పది ఈడీ సమన్లను తప్పించుకున్నారు. అంతకుముందు, డబ్బుకు సంబంధించి ఏజెన్సీ సమన్లను పాటించలేదని ఆరోపిస్తూ ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో తనకు సమన్లు జారీ చేస్తూ మేజిస్ట్రేట్ కోర్టు ఏప్రిల్ 9న జారీ చేసిన ఉత్తర్వును సమర్థిస్తూ జూలై 31న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టాలని ఖాన్ కోరారు.
ఏప్రిల్ 4న, ఈడీ ఖాన్‌పై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్‌లు 190, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 174, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 63(4)ను పాటించనందుకు ఫిర్యాదు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద అతనికి సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఖాన్ తన సహచరులైన జావేద్ ఇమామ్ సిద్ధిఖీ, దౌద్ నాసిర్, జీషన్ హైదర్, కౌసర్ ఇమామ్ సిద్ధిఖీల ద్వారా స్థిరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా తన అక్రమ సంపాదనను లాండరింగ్ చేశాడని ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
ఢిల్లీ వక్స్‌బోర్డు నియామకాల్లో అవకతవల ఆరోపణలపై 2016లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అమానతుల్లా ఖాన్ ఉన్నారు. తప్పుడు నియామకాల ద్వారా ఆయన వ్యక్తిగత లబ్ధి పొంది, ఢిల్లీ ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించారని సీబీఐ ఆరోపించింది. అనంతరం దీనిపై మనీలాండరింగ్ దర్యాప్తును ఈడీ ప్రారంభించింది. గత ఏడాది అమానతుల్లా ఖాన్ నివాసాలపై దాడులు నిర్వహించి కొన్ని భౌతిక, డిజిటల్ సాక్ష్యాలను జప్తు చేసింది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ