హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తనతో పాటు మంత్రులు, ఎమ్యెల్యేలు అందరికి రెండు నెలలపాటు జీతభత్యాలను ఉండబోవని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు గురువారం రాష్త్ర శాసనసభలో ప్రకటించారు. మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు, బోర్డులు- కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సహా ఎటువంటి జీతం, భత్యాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.
“అసెంబ్లీ సభ్యులందరూ స్వచ్ఛందంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను” అని కోరారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి, అనుత్పాదక వ్యయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.
2023-24 సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్ (ఆర్‌డిజి) రూ. 8,058 కోట్లుగా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,800 కోట్లకు తగ్గి రూ.6,258 కోట్లకు చేరుకుందని సుఖు తెలిపారు. “2025-26లో, రెవెన్యూ లోటు గ్రాంట్‌ను మరో రూ. 3,000 కోట్లు తగ్గించి కేవలం రూ. 3,257 కోట్లకు తగ్గించనున్నాము. ఇది మన అవసరాలను తీర్చడం మరింత కష్టతరం చేస్తుంది” అని ఆయన చెప్పారు.
‘‘రాబోయే కాలంలో రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందే వరకు 2 నెలలపాటు జీతం గానీ, టీఏ గానీ, డీఏ గానీ తీసుకోబోమని మంత్రివర్గంలోని సభ్యులంతా చర్చించి నిర్ణయం తీసుకున్నాము. ఇది చాలా తక్కువ మొత్తం మాత్రమే. కానీ ఇది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో మనవంతు ప్రయత్నం చేస్తున్నాము” అని సుఖ్విందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు.
ఆయన ఎక్స్‌లోని ఒక పోస్ట్‌లో, “మేము రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల కోసం నిర్ణయాత్మక చర్య తీసుకున్నాము. మేము ఎల్లప్పుడూ మా వ్యక్తిగత లాభాల కంటే రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును పరిగణలోకి తీసుకొంటాము. గౌరవప్రదమైన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఉదాత్తమైన పనిలో మాతో పాల్గొంటారని, వారు కూడా తమ జీతభత్యాలను వదులుకునేందుకు ఈ ముఖ్యమైన నిర్ణయానికి స్వచ్ఛందంగా మద్దతు ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని తెలిపారు.
“ఇది మన బాధ్యత మాత్రమే కాదు, మన నిజమైన చిహ్నంగా కూడా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుని పట్ల సేవ, విధేయతకు ప్రతీక”, అని ఈ సందర్భంగా చెప్పారు. విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ, “రాష్ట్ర పరిస్థితి బాగా లేదు, దీనికి ఎవరైనా బాధ్యత వహిస్తే, అది గత బిజెపి ప్రభుత్వమే, వారికి సుమారు 15వ ఆర్థిక సంఘం ప్రకారం రెవెన్యూ లోటు గ్రాంట్ నుండి రూ. 10,000 వచ్చాయి. అప్పటి నుండి ఈ గ్రాంట్ తగ్గుతోంది” అని వివరించారు.
More Stories
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం