అధికారం కోల్పోయిన తర్వాత వైసిపి నుండి రాజీనామాల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల రాజీనామా ప్రారంభమైనది. గురువారు ఇద్దరు రాజ్యసభ సభ్యులు – మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలు అందజేశారు.
వీరి బాటలోనే మరికొందరు రాజ్యసభ సభ్యులు కూడా నడవనున్నట్లు భావిస్తున్నారు. వారిలో అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, ఆర్.కృష్ణయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తున్నది.
అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు.త్వరలో తాను టీడీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ఏమిటనేది వైసీపీ నేతలే ఆలోచించాలని హితవు చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారని పేర్కొన్నారు.
చిల్లరగా మాట్లాడే మనస్తత్వం తనది కాదని చెబుతూ రాజ్యసభ పదవిపై తాను మొదటి నుంచి ఆసక్తిగా లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని మోపిదేవి వెంకట రమణ ప్రకటించారు. రాజకీయ వ్యవస్థను, రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టాలని చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ నేతలు కూడా తనతో చర్చించారని మోపిదేవి వెల్లడించారు.
రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గం వెళ్లి కార్యకర్తలతో సమావేశం అవుతానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోవాలని హితవు చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బీద మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు బీద రవిచంద్ర కూడా టీడీపీలోనే ఉన్నాడని గుర్తు చేశారు. రాబోయే రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
More Stories
ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య
విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశకు ఆమోదం
ఏపీలో 3 వేల మంది చిన్నారులు మిస్సింగ్