ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, వారి కోసం జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
ఓరుగల్లు పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి దర్శనం అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకోగా రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో కృషి చేసిన మంత్రి సీతక్క ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలతో మహిళలు, చిన్నారులు గవర్నర్ కు స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో గవర్నర్ జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్వో లు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రశంసించారు.
పేదల అభ్యున్నతికి, గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని అంటూ అభినందించారు. ముఖ్యంగా విద్యా, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ తొలిసారి జిల్లా పర్యటనకు గవర్నర్ రావడం పట్ల జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తర్ణం ఉందని, 30 శాతం మంది ఆదివాసీలు, గిరిజన ప్రజలు ఈ జిల్లాలోనే ఉన్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలంతా ఐకమత్యంతో నివసిస్తారని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక గా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని ఆమె చెప్పారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుందని, ఆ జాతరను జాతీయ పండుగగా గుర్తించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క గవర్నర్ ను కోరారు.

More Stories
పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్
పంచ పరివర్తన స్ఫూర్తితో విపణి పర్వ పేరుతో వినూత్న మార్కెట్
తెలంగాణాలో సెంటిమెంట్ పని చేయదా!