వచ్చే పండుగ సీజన్ కంటే ముందుగానే ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులకు శుభవార్తను అందించాయి. పలు ప్యాసింజర్, వాణిజ్య వాహనాల తయారీ సంస్థలు స్క్రాపేజ్ సర్టిఫికెట్‌తో తమ వాహనాలపై 1.5 శాతం నుంచి 3 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అనంతరం పలు ఆటోమొబైల్ సంస్థలు ప్రకటించాయి.
దీంట్లో భాగంగా జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఏకంగా రూ.25 వేల రాయితీని ప్రకటించింది. దేశీయ ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన సమావేశానికి దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.
కమర్షియల్ వాహన తయారీదారులు రెండేండ్లపాటు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించగా, ప్యాసింజర్ వాహన సంస్థలు అయితే స్వల్పకాలం మాత్రమే అంటే ఏడాది వరకు ఈ ప్రయోజనాలను కల్పించనున్నట్లు పేర్కొంది. వీటిలో కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటర్, కియా మోటర్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్, రెనో, నిస్సాన్, స్కోడా ఇండియా సంస్థలు షోరూం ధరలో 1.5 శాతం లేదా రూ.20 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
వాహన స్థితి ఆధారంగా అదనంగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు తమకు నచ్చిన మొడళ్లకు మాత్రమే ఈ రాయితీ వర్తింపు చేసుకునే అవకాశాలను కూడా కల్పించింది. పాత కార్ల స్థానంలో ఎక్సేంజ్ కింద కొత్త కార్లను కొనుగోలు చేసేవారికి ఈ ప్రయోజనాలు పొందవచ్చును. డిస్కౌంట్లు అందించేందుకు అంగీకరించిన వాహన తయారీ సంస్థలకు గడ్కరీ అభినందనలు తెలిపారు. వాహనాల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగస్వాములైన కంపెనీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం