టెలిగ్రామ్ యాప్‌పై చర్యలకు ఐటీ మంత్రిత్వ శాఖ సన్నద్ధం

టెలిగ్రామ్ యాప్‌పై చర్యలకు ఐటీ మంత్రిత్వ శాఖ సన్నద్ధం
మెసేజింగ్ యాప్‌ టెలిగ్రాం సీఈవో పావెల్‌ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకోవడంతో ఐటీ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. భారత్‌లో టెలిగ్రాం యాప్‌ నిబంధనల ఉల్లంఘనలకు ఏమైనా పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖను ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. 
 
టెలిగ్రాంపై ఏమైనా ఫిర్యాదులుపెండింగ్‌లో ఉంటే భారత్‌లోనూ సదరు యాప్‌పై తగిన చర్యలు చేపట్టేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సన్నద్ధమైంది.  ఫ్రాన్స్‌లో పావెల్‌ దురోవ్‌ అరెస్ట్ నేపధ్యంలో టెలిగ్రాంపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించాలని, యాప్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చని హోంమంత్రిత్వ శాఖను ఐటీ మంత్రిత్వ శాఖ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
దోపిడీ,గ్యాంబ్లింగ్‌ వంటి కార్యకలాపాలకు టెలిగ్రాం యాప్‌ ప్లాట్‌ఫాంగా దుర్వినియోగంపై భారత ప్రభుత్వం నిర్ధిష్టంగా టెలిగ్రాంపై విచారణ చేపట్టాలని యోచిస్తోందని మరో వార్తా కథనం వెల్లడించింది. కాగా, మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రాం సీఈవో పవెల్‌ దురోవ్‌ను ఫ్రాన్స్‌లోని లీ బగెట్‌ ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రైవేట్‌ జెట్‌ నుంచి దిగిన వెంటనే అరెస్ట్‌ చేశారు. మెసేజింగ్‌ యాప్‌నకు జారీ చేసిన ఓ వారెంట్‌ కింద టెలిగ్రాం సీఈవోను ఫ్రాన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రాంపై నేర కార్యకలాపాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయన అరెస్ట్‌కు దారితీసిందని చెబుతున్నారు. టెలిగ్రాంను చట్టవిరుద్ధ కార్యకలపాలకు వినియోగించుకునేందుకు నిరోధించేందుకు సరైన చర్యలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు.  మరోవైపు ఈ ఆరోపణలను టెలిగ్రాం తోసిపుచ్చింది. సీఈవో తప్పించుకుని తిరగడం లేదని, ఆయన అదృశ్యం కాలేదని పేర్కొంది. మరోవైపు దురోవ్‌పై మోసం, డ్రగ్‌ ట్రాఫికింగ్‌, వ్యవస్ధీకృత నేరం, ఉగ్రవాదానికి ఊతం సహా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్‌ అధికారులు చేసిన ఆరోపణలన్నింటినీ టెలిగ్రాం కొట్టిపారేసింది.