కొత్త పెన్షన్‌ స్కీమ్‌ స్థానంలో కేంద్రం ఏకీకృత పెన్షన్‌ స్కీమ్‌!

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ స్థానంలో కేంద్రం ఏకీకృత పెన్షన్‌ స్కీమ్‌!
 
* జీతంలో కనీసం 50% పెన్షన్
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్‌ స్కీమ్‌ కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌ స్కీమ్‌ కి బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్‌ స్కీమ్‌ ప్రారంభించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి వర్గల సమావేశంలో కొత్త పెన్షన్‌ స్కీమ్‌పై ఏకాభిప్రాయం కుదిరింది. 
 
కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ వివరించారు. ఎన్‌పీఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉందని చెప్పారు. ఇందులో సంస్కరణల కోసం ఏప్రిల్‌ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కమిటీ ఏర్పాటు చేశారని, కమిటీకి డాక్టర్‌ సోమనాథన్‌ చైర్మన్‌గా ఉన్నారని వివరించారు.

కమిటీ వందకుపైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో సంప్రదింపులు జరిపిందని, దాదాపు అన్ని రాష్ట్రాలతోనూ చర్చలు జరిపిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు సైతం ప్రాధాన్యం ఇచ్చారని చెబుతూ ఈ అంశాన్ని ప్రధాని సీరియస్‌గా తీసుకున్నారని, కమిటీ సిఫారసు మేరకు ఏకీకృత పింఛన్‌ స్కీమ్‌కు ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. 

ఇక 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. యూపీఎస్ స్కీమ్‌ ద్వారా 23లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనుండగా.. ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రాబోతున్నది. పదేళ్లు సర్వీస్‌ చేసిన వారికి రూ.10వేల పెన్షన్‌ వస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60శాతం పెన్షన్‌ ఇస్తారని పేర్కొన్నారు. 

సర్వీస్‌లో 25 సంవత్సరాలు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్‌ స్కీమ్‌ని కేంద్రం తెచ్చింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం బయో ఈ-3 విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.