
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో చెబుతున్న కీలకాంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటని నిలదీశారు. ఇది జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడమే అవుతుందని ధ్వజమెత్తారు.
పాకిస్థాన్‌తో ”ఎల్ఓసీ ట్రేడ్”ను ప్రారంభించాలని నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మద్దతిస్తారా? అని అమిత్‌షా ప్రశ్నించారు. ఇందువల్ల సరిహద్దు్ల వెంబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని హెచ్చరించారు.
”కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో పదేపదే దేశ సమైక్యత, భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అబ్దుల్లా కుటుంబ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో జమ్మూకశ్మీర్‌లో పొత్తు పెట్టుకోవడం ద్వారా మరోదారి ఆ పార్టీ దురుద్దేశం బయటపడింది” అని అమిత్‌షా ఒక ట్వీట్లో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి 10 ప్రశ్నలు గుప్పించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండాలనే నేషనల్ కాన్ఫరెన్స్ వాగ్దానానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? అని అమిత్‌షా ప్రశ్నించారు. 370వ అధికరణ, 35Aను పునరుద్ధరిస్తామని ఎన్సీ గట్టిగా చెబుతోందని, కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సమర్ధిస్తుందా? జమ్మూకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం, అంశాతి వైపు నెట్టేయాలనుకుంటోందా? అని మరో సూటి ప్రశ్న వేశారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, సమగ్రతకు ఈ చర్య తప్పనిసరి అని పేర్కొంది. పాకిస్థా్న్తో చర్చలు జరపడంపై కాంగ్రెస్-ఎన్పీ కూటమి వైఖరిని కూడా అమిత్‌షా తన పోస్ట్‌లో ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని కూడా అమిత్‌షా ఆరోపించారు. దళితులు, గుజ్జర్లు, బకర్వాల్స్, పహాడి కమ్యూనిటీలకు రిజర్వేషన్లు స్వస్తి చెబుతామని ఎన్సీ వాగ్దానం చేసిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో శంకరాచార్య హిల్, హరి హిల్స్ వంటి పేర్లును ఇస్లామిక్ పేర్లతో పాపులర్ చేస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ వైఖరేమిటని కూడా అమిత్‌షా ప్రశ్నించారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్