అమెరికాలో 30% పెరిగిన భారత విద్యార్థుల సంఖ్య

అమెరికాలో 30% పెరిగిన భారత విద్యార్థుల సంఖ్య

* యూకేలో తగ్గుతున్న భారత్‌ విద్యార్థులు

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థుల మొదటి ఎంపిక అమెరికా. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం ఈ దేశంలోనే చదవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు తమ దేశంలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను అమెరికా పబ్లిక్‌ డిప్లొమసీ శాఖ మంత్రి సలహాదారు గ్లోరియా బెర్బెనా ఒక ఆంగ్ల మీడియాకు తెలియజేశారు. అమెరికా వచ్చే భారత విద్యార్థుల సంఖ్య గత ఏడాదిలోనే 30 శాతం పెరిగినట్టు ఆమె చెప్పారు.

తమ దేశం పట్ల భారత విద్యార్థుల ఆసక్తి, అనురక్తి తమకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని ఆమె చెప్పారు. గత ఏడాది తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతే నెంబర్‌ వన్‌ అని వెల్లడించారు. అమెరికా రావాలనుకునే విద్యార్థులు కొంత మంది బ్రోకర్లు, కన్సల్టెన్సీల చేతిలో మోసపోకుండా నేరుగా తామే విద్యార్థులతో సంబంధాలు పెట్టుకునేందుకు ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. దీని వల్ల వారి సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

అందులో భాగంగా 125 అమెరికా యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఢిల్లీలో ఒక ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అమెరికా రావాలనుకునే విద్యార్థులు దీనికి హాజరు కావాలని ఆమె కోరారు. వివిధ యూనివర్సిటీలలో ఉన్న కోర్సులు, దరఖాస్తు విధానం, వీసా నిబంధనలు, అయ్యే ఖర్చెంత, ప్రవేశార్హత ఇలా తమకు కావాల్సిన వివరాలన్నీ ఇందులో పొందవచ్చునని ఆమె వెల్లడించారు. 

తమ దేశంలోని 4,500 ఉన్నత విద్యా సంస్థలు అద్భుతమైన అక్రిడేటెడ్‌ డిగ్రీ విద్యను అందిస్తున్నాయని, భారత విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఒక వైపు అత్యధికంగా భారత విద్యార్థులకే యూకే వీసాలు మంజూరు చేస్తుండగా, మరో పక్క యూకే యూనివర్సిటీలకు దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. 

ఇటీవల ఆ దేశంలో విధించిన వలస విధాన ఆంక్షలు, వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కారణాల వల్ల ఆ దేశం వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని గురువారం వెలువడిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గత ఏడాది నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఉన్న డాటాను పోలిస్తే ఉన్నత విద్య కోసం యూకేకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 23 శాతం తగ్గింది. గ్రాడ్యుయేషన్‌ నిమిత్తం వచ్చే విద్యార్థులను ప్రోత్సహించేందుకు చదువైన తర్వాత వారు రెండేండ్ల పాటు దేశంలోనే ఉండేందుకు అనుమతించే గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాను ఇస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గడం గమనార్హం.

స్టూడెంట్‌ వీసా ఉన్నవారు తమతో పాటు తమపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తెచ్చుకునేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే దానిపై ఆంక్షలు విధిస్తూ గత ఏడాది తెచ్చిన కొత్త నిబంధనలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019-2023 కాలంలో యూకేకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా ఉండేది. వీరిలో ఎక్కువగా భారతీయులు, నైజీరియన్లు ఉండేవారు. అయితే తాజా గణాంకాలు చూస్తే వరుసగా వీరిలో 23 శాతం, 46 శాతం తగ్గుదల నమోదైంది.