ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలలో సోమవారం ఎన్నికల అధికారులు జరుపుతున్న మాక్ పోలింగ్ రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, భారీ ఆధిక్యతతో ఓటమి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ఫలితాల పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమకు బలం ఉన్న ప్రాంతాల్లోనూ మెజార్టీ రాకపోవటంపైన సందేహాలతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేసింది. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ అభ్యర్థి కూడా అంతటి భారీ మెజారిటీతో గెలుపొందలేక పోవడంతో బాలినేని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పన్నెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. అందుకోసమే ఆయన రూ.5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తమీమ్ అన్సారియా హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో నేడు మాక్ పోలింగ్..రీ చెకింగ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్ కంపెనీ ప్రతినిధులను కూడా వారు ఆహ్వానించారు. దీంతో, ఈ మాక్ పోలింగ్ నిర్వహణ, పరిశీలన సమయంలో ఎలాంటి అంశాలు గుర్తిస్తారు? ఏం జరుగుతుందనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది.
ఇదే తరహాలో మరి కొందరు నేతలు ఫిర్యాదులు చేయటంతో ఇక్కడ వచ్చే ఫలితం కీలకం కానుంది. నేటి నుంచి ఈనెల 24 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆరు రోజుల పాటు మాక్ పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరుగనుంది.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్