
మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని చెబుతూ కాలంచెల్లిన బిఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోవాల్సిన ఖర్మ బిజెపికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని చెప్పారు.
రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బిఆర్ఎస్ విలీన డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని ధ్వజమెత్తారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి…వాటితో ప్రజలకేం సంబంధం అని ప్రశ్నించారు.
రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేశారని తెలిపారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్లో రూ.26 వేలు కేటాయించి, చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు చెబుతూ మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు వెంటనే బ్యాంక్ ల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. లోన్ తీసుకున్న రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుంటే భవిష్యత్ లో ఎలాంటి రుణం పొందలేరనే విషయం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
కల్యాణ లక్ష్మి లక్ష రూపాయలు, తులం బంగారం సహా 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. 30 వేల ఉద్యోగాలని 12 వేల ఉద్యోగులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల మేడలో కూర్చొని ప్రజలకు అన్ని చేశాం అని అనుకుంటుందని తెలిపారు. రైతు భరోసా, బోనస్, రుణమాఫీ చేస్తామని చేయలేదని చెబుతూ ప్రజలకు అన్ని విషయాలు తెలుసని హెచ్చరించారు.
More Stories
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం