27 ఏండ్ల త‌ర్వాత శ్రీ‌లంక‌కు వ‌న్డే సిరీస్

27 ఏండ్ల త‌ర్వాత శ్రీ‌లంక‌కు వ‌న్డే సిరీస్
పొట్టి సిరీస్‌లో శ్రీలంక‌ను వ‌ణికించిన భార‌త జట్టు వ‌న్డే సిరీస్‌లో తేలిపోయింది. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో స్పిన్ ఉచ్చులో ప‌డి ఆతిథ్య జ‌ట్టుకు సిరీస్ అప్ప‌గించేసేంది. బుధ‌వారం జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో టీమిండియా 110 ప‌రుగుల తేడాతో ఓడింది.  వ‌ర‌ల్డ్ క్లాస్ బ్యాట‌ర్ల‌తో కూడిన భార‌త్ లంక స్పిన్న‌ర్ల ధాటికి కుదేలైంది.
దునిత్ వెల్ల‌లాగే (5/27) విజృంభ‌ణ‌తో రోహిత్ సేనకు మ‌రో ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. దాంతో చ‌రిత అస‌లంక నేతృత్వంలోని లంక 2-0తో వ‌న్డే సిరీస్ కైవసం చేసుకుంది. త‌ద్వారా శ్రీలంక 27 ఏండ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టుపై ద్వైపాక్షిక సిరీస్ గెలుపొందింది.  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా శ్రీ‌లంక‌కు వ‌చ్చిన‌ భార‌త జ‌ట్టుకు వ‌న్డే సిరీస్‌లో ఊహించ‌ని షాక్ త‌గిలింది.
హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆధ్వ‌ర్యంలో పొట్టి సిరీస్ గెలిచిన టీమిండియా వ‌న్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా ఓడింది. కొలంబ‌లోని ప్రేమ‌దాస స్టేడియంలో తొలి వ‌న్డేను టైగా ముగించిన భార‌త్.. రెండో వ‌న్డేలో కుప్ప‌కూలింది. ఇక మూడో వ‌న్డేలో గెలుపొంది సిరీస్ స‌మం చేస్తుంద‌నుకుంటే.. మ‌ళ్లీ స్పిన్ ఉచ్చులో ప‌డి మ్యాచ్ చేజార్చుకుంది.
 
లంక నిర్దేశించిన 249 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(35), శుభ్‌మ‌న్ గిల్(6)లు స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. అవిష్క ఫెర్నాండో ఓపెన‌ర్ గిల్‌ను బౌల్డ్ చేసి 37 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ తీశాడు. ఆ త‌ర్వాత దునిత్ వెల్ల‌లాగే(5/27) స్పిన్ మాయ చేస్తూ హిట్‌మ్యాన్ వికెట్ తీసి లంక‌ను పోటీలోకి తెచ్చాడు. 
దాంతో 53కే రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్‌ను విరాట్ కోహ్లీ(20), పంత్‌లు ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.
కానీ, థీక్ష‌ణ బౌలింగ్‌లో పంత్ స్టంపౌట్ కాగా ప‌వ‌ర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది.  అయినా స‌రే కోహ్లీ ఉన్నాడ‌నే ధైర్యం. కానీ, అత‌డిని సైతం వెల్ల‌లాగే బోల్తా కొట్టించి ఎల్బీగా డ‌గౌట్‌కు పంపాడు.  అంతే.. అక్క‌డితో మొద‌లైన వికెట్ల ప‌త‌నం ఇక ఆగ‌లేదు. శ్రేయ‌స్ అయ్య‌ర్(8), అక్ష‌ర్ ప‌టేల్(2)లు నిరాశ‌ప‌ర‌చ‌గా రియాన్ ప‌రాగ్(15), వాషింగ్ట‌న్ సుంద‌ర్(30)లు పోరాడినా లంక స్పిన్న‌ర్లు వికెట్ల వేట కొన‌సాగించారు. కుల్దీప్ యాద‌వ్ ఔట‌వ్వ‌డంతో లంక 110 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.
 
ఆఖ‌రిదైన మూడో వ‌న్డేలో భార‌త బౌల‌ర్లు శ్రీ‌లంకను అద్భుతంగా క‌ట్ట‌డి చేశారు. అరంగేట్ర కుర్రాడు రియాన్ ప‌రాగ్ (3/54) సూప‌ర్ స్పెల్‌లో రాణించగా ఆతిథ్య జ‌ట్టు ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్లు అవిష్క ఫెర్నాండో(94), ప‌థుమ్ నిశాంక‌(45)లు లంకు శుభారంభమిచ్చినా మిడిలార్డ‌ర్ చేతులెత్తేసింది. ఆఖ‌ర్లో కుశాల్ మెండిస్(59), క‌మింద్ మెండిస్(23 నాటౌట్)లు ధ‌నాధ‌న్ ఆడారు. దాంతో, శ్రీ‌లంక పోరాడ‌గ‌లిగే స్కోర్ చేయ‌గ‌లిగింది.