ఐఎస్‌ఎస్‌కు శుభాన్షు శుక్లా.. ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) వెళ్లేందుకు గానూ చేపట్టనున్న ఇండో-యూఎస్‌ మిషన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లాను ఎంపిక చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రకటించింది. బ్యాకప్‌గా గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఏదైనా కారణంగా వల్ల శుభాన్షు శుక్లా ఈ మిషన్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ వెళ్తారు. 
 
అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు గానూ అమెరికాకు చెందిన నాసా గుర్తింపు పొందిన యాక్సియమ్‌ స్పేస్‌ సంస్థతో ఇస్రోకు చెందిన హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా త్వరలో చేపట్టనున్న యాక్సియమ్‌-4 మిషన్‌లో భాగంగా వీరి అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ ఇద్దరు గగన యాత్రికులకు ఈ వారం నుంచి శిక్షణ ప్రారంభం కానున్నట్లు ఇస్రో తెలిపింది. 
 
అయితే, వీరి గగనయాత్రకు చివరగా మల్టీలాటరల్‌ క్రూ ఆపరేషన్స్‌ ప్యానల్‌ (ఎంసీఓపీ) ఆమోదం లభించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఇప్పటివరకు భారత్‌ నుంచి వింగ్‌ కమాండర్‌ (విశ్రాంత) రాకేశ్‌ శర్మ మాత్రమే అంతరిక్షంలో అడుగుపెట్టారు. 1984లో ఇండో-సోవియెట్‌ మిషన్‌లో భాగంగా ఆయన అంతరిక్షానికి వెళ్లారు. ఈ ఘనత సాధించబోతున్న రెండో వ్యక్తిగా శుభాన్షు లేదా ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నిలవబోతున్నారు. 
 
అంతరిక్షంలో అడుగుపెట్టనున్న ఐదో భారత సంతతికి చెందిన వ్యక్తిగా వీరిద్దరిలో ఒకరు నిలవనున్నారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మతో పాటు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజాచారి అంతరిక్షానికి వెళ్లారు. కాగా, 2025లో భారత్‌ చేపట్టాలనుకుంటున్న ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రయోగానికి గానూ ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్న నలుగురు వ్యోమగాముల్లో(గగన్‌యాత్రి) వీరిద్దరు కూడా ఉన్నారు. 
 
ఈ నలుగురిలో శుభాన్షు శుక్లా పిన్న వయస్కుడు కాగా, ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ పెద్దవయస్కుడు. ఈ మిషన్‌ ద్వారా వచ్చే అనుభవం భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే అంతరిక్ష కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, ఇస్రో, నాసా మధ్య సహకారం బలోపేతం అవుతుందని ఇస్రో తెలిపింది.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985 అక్టోబరు 10న జన్మించిన శుభాన్షు శుక్లా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నుంచి 2006 జూన్‌ 17న భారత వాయుసేనలో చేరారు. సుఖోయ్‌-30ఎంకేఐ, మిగ్‌-21, మిగ్‌-29, జాగ్వార్‌, హాక్‌, డోర్నియర్‌, ఏఎన్‌-32 వంటి వివిధ యుద్ధవిమానాలకు పైలట్‌గా ఆయనకు దాదాపు 2,000 గంటల విమానాలను నడిపిన అనుభవం ఉంది. 

కేరళలోని తిరువజియద్‌లో 1976 ఆగస్టు 26న జన్మించిన ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ ఎన్‌డీఏ ద్వారా 1998 డిసెంబరు 19న భారత వాయుసేనలో చేరారు. పైలట్‌గా అత్యున్నతమైన హోదా అయిన క్యాటగిరి-ఏ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. సుఖోయ్‌-30ఎంకేఐ స్కాడ్రన్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఆయనకు ఉంది.