కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 160కి చేరుకున్నది. ప్రస్తుతం ముండక్కిలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. 143 మందికి అటాప్సీ పూర్తి చేశారు. 20 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ను మంగళవారం రాత్రి నిలిపివేశారు. తిరిగి బుధవారం ఉదయం మళ్లీ ఆ ఆపరేషన్ మొదలుపెట్టారు.
48 మంది బాధితుల మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టమ్ అయిన మృతదేహాలకు వాళ్ల బంధువులకు అప్పగించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బుధవారంఉదయం మలప్పురంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తన కాన్వాయ్‌తో వయనాడ్‌కు వెళ్తున్న మంత్రి కారు ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి.. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. మంత్రి వీణకు స్వల్ప గాయాలయ్యాయి.
అయితే, వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. చాలా ఇండ్లు వరద, బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకున్న ప్రజలు తమను కాపాడమని హాహాకారాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు, మనుషుల శరీర అవయవాలు చలియార్ నదిలో కొట్టుకుపోతున్నాయి.
ఇక్కడి తోటల్లో పని చేసేందుకు అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన దాదాపు 600 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు విపత్తు సృష్టించిన విలయంతో హృదయవిదారకంగా మారింది.
సోమవారం నుంచి వయనాడ్ ప్రాంతంలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మెప్పడి, చూరల్‌మల గ్రామాలతో పాటు ముండక్కై పట్టణంలో కొండచరియలు మీద పడ్డాయి. ముండక్కై పట్టణంలోని రెండు వార్డుల్లో వందలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి.
చూరల్‌మల గ్రామంలో చాలా భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. ముండక్కై, చూరమల, అట్టమల, నూల్‌పుజ తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టానికి తోడు వరద కూడా మరింత విలయాన్ని మిగిల్చింది.
కొండల మీదుగా విరిగిపడ్డ శిథిలాలు నీటి ప్రవాహంలో పడటం, భారీ వర్షాల కారణంగా ఎగువ కొండల నుంచి వరద ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా ఇండ్లు, దుకాణాలు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లు బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకుపోయిన వారు బయట ఉన్న వారికి ఫోన్లు చేసి కాపాడాలని విలపిస్తూ వేడుకుంటున్నారు.
కొండచరియలు పడటం, వరద వల్ల చూరల్‌మల బ్రిడ్జి, ముండక్కై బ్రిడ్జి కూలిపోయాయి. ముండక్కైకి వెళ్లే రహదారిపై కూడా భారీగా కొండచరియలు పడిపోయాయి. దీంతో ఈ ప్రాంతాలకు చేరుకునేందుకు రోడ్డుమార్గం పూర్తిగా తెగిపోయింది. చివరకు రోప్‌లు వేసుకొని సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు.
2020లోనూ ముండక్కైలో తక్కువ తీవ్రతతో కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. దీంతో దాదాపు 200 మంది ఇండ్లను వదిలి ముండక్కైలోని ఓ రిసార్ట్, మద్రస్సాలో తలదాచుకొని ప్రాణాలు దక్కించుకున్నారు.
వెల్లరిమల్లలో సహాయ శిబిరం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. లోపల చిక్కుకున్న వారు తమను కాపాడమని ఫోన్లు చేసి వేడుకుంటున్నారని, వాయిస్ క్లిప్స్ వస్తున్నాయని ఈ పాఠశాల టీచర్ ఒకరు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఆర్మీ, నేవీ సిబ్బంది కూడా సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు.
పకృతి ప్రకోపమే కారణం
వయనాడ్ విలయానికి ప్రకృత్రి ప్రకోపమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేరళలో స్వల్ప వ్యవధిలో దట్టమైన మేఘాలు ఏర్పడటం, అతిభారీ వర్షాలు కురవడానికి అరేబియా సముద్రం, ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కడం ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.
2018లో సంభవించిన విధ్వంసక వరదల్లో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 483 మంది మరణించారు. కేరళపై ప్రకృతి విపత్తులకు నిపుణులు పలు కారణాలను వెల్లడిస్తున్నారు. కేరళలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నదని, రాష్ట్రంలోని 14.5% భూభాగం అందుకు దుర్భలంగా ఉన్నట్టు అంచనా.
పర్యావరణ మార్పులు, అటవీ నిర్మూలన వంటివి వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలూ విపత్తులకు కారణమని విశ్లేషిస్తున్నారు.
దేశంలో కేరళలోనే అధిక సంఖ్యలో కొండ చరియలు విరిగిపడే ఘటనలు చోటుచేసుకొంటున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ గతంలో పార్లమెంట్‌లో వెల్లడించింది. 2015-22 మధ్య 3,782 ఘటనలు చోటుచేసుకోగా, వాటిల్లో 2,239(59.2%) ఒక్క కేరళలోనే జరిగాయని తెలిపింది.
మొత్తం 1,848 చదరపు కిలోమీటర్లు(రాష్ట్రం విస్తీర్ణంలో 4.75%) ‘హై ల్యాండ్ స్లెడ్ హజార్డ్ జోన్’గా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ గుర్తించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదు గమనించాల్సిన అంశమని కేరళ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త రాజీవ్ పేర్కొన్నారు. వయనాడ్ ప్రాంతంలో సోమవారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో గత 48 గంటల్లో 572 ఎంఎం వర్షపాతం నమోదయ్యింది. దీంతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చలియార్ నది ఉగ్రరూపం దాల్చింది. ఇరువఝింజిపుజ నది రెండుగా చీలిపోయి ప్రవహిస్తున్నది.
దీంతో అనేక గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. బుధవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ చూసిన తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. వయనాడ్ విలయంలో ధ్వంసమైన ప్రజల జీవితాలు, జీవనోపాధిని పునర్నిర్మించేందుకు కలిసిరావాలని ఆయన ప్రజలను కోరారు.
2018 నాటి వరదల నుంచి రాష్ర్టాన్ని పునర్నిర్మించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ పండ్‌కు సాయం అందించాలని కోరారు. వయనాడ్ జిల్లాలో 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, 3,000 మందిని తరలించినట్టు ఆయన చెప్పారు.
More Stories
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు
ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం