
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికలు పూర్తై టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జులై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారనే వార్తలు వచ్చాయి.
అయితే మరి కొన్ని నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.86 లక్షల కోట్లతో గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించింది. ఇందులో రూ.96,000 కోట్ల బడ్జెట్‌ను 4 నెలల కోసం ఆమోదించారు.
మరో 4 నెలలకు ఇప్పుడు ఆమోదించే బడ్జెట్ కూడా సుమారు అంతే ఉండే అవకాశాలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తెచ్చింది.
ఈ ఆర్డినెన్స్‌కు ఆన్లైన్ ద్వారానే మంత్రివర్గం నుంచి ఆమోదం తీసుకుంది. తదుపరి ప్రక్రియలో భాగంగా గవర్నర్ ఆమోదం కోసం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పంపారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే ఒకే ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావటం ఇదే ప్రథమం. సుమారు రూ.1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిసింది. 2024 సెప్టెంబర్‌లో పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లు ఉన్నట్లు సమాచారం. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్‌కు నిధులు కేటాయించినట్లు సమాచారం.
ఆగస్టు 15 నుంచి వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వీటి నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించినట్లు తెలిసింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు