జనసేన పార్టీ ఎమ్మెల్యే బాలరాజు కాన్వాయ్‌పై దాడి

జనసేన పార్టీ ఎమ్మెల్యే బాలరాజు కాన్వాయ్‌పై దాడి
ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరగా ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. 
ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.  కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
అయితే దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని, తాను సురక్షితంగా ఉన్నట్లు బాలరాజు చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఈ సంఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆకతాయిలు విసిరిందా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా విసిరారా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలవరం డిఎస్పీ సురేష్ రెడ్డి తెలిపారు. 
 
మరోవైపు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.  ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేపై ఇలాంటి దాడులు జరగడం దారుణమని చెప్పారు.
 
మరోవైపు బాలరాజు సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తనిఖీకి వెళ్ళారు. ఆఫీసు సమయంలో ఉద్యోగి సాయి కుమార్ పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
 
ఇటు బుట్టాయిగూడెం మండలం రాజానగరంలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పదవ తరగతి క్లాస్ విద్యార్థులతో పాటు పాఠాలు విన్నారు. అలాగే హాస్టల్ భవనం, మెస్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్‌లో మెస్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని కోరారు. 
 
ఆ తర్వాత టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. గత ప్రభుత్వంలో ఇక్కడ నూతన భవనం కొరకు కొంత నిధులు కేటాయించి కనీసం బేస్మెంట్ కూడా నోచుకోలేదని,  సుమారుగా రూ. 2.5 కోట్లు అవినీతి జరిగిందని మండిపడ్డారు.