ఈవీఎం, వివిపిఎటి స్లిప్పులతో ఓట్ల వెరిఫికేషన్‌ కు తిరస్కరణ

ఈవీఎం, వివిపిఎటి స్లిప్పులతో ఓట్ల వెరిఫికేషన్‌ కు తిరస్కరణ
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల ఓట్లను వాటి ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిపిఎటి) స్లిప్పులతో వందశాతం వెరిఫికేషన్‌ చేయాలంటూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లను తిరస్కరిస్తూ ఇచ్చిన సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్‌ 26న ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ధర్మాసనం రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
‘మేము రివ్యూ పిటిషన్‌ను, దానికి మద్దతుగా ఉన్న కారణాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాము. మా అభిప్రాయం ప్రకారం ఏప్రిల్‌ 26, 2024 నాటి తీర్పును సమీక్షించడానికి ఎటువంటి సందర్భం లేదు. తదనుగుణంగా రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తోంది’ అని ధర్మాసనం జులై 25న తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్‌ నేపథ్యంలో..పేపర్‌ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్‌ జరపాలని, ఇవిఎం, వివిపాట్‌ ఓట్ల లెక్కింపును వంద శాతం క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 26వతేదీ తిరస్కరించింది. 
 
పేపర్‌ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్‌ జరపడం, ఆ విధానాన్నే మరలా తీసుకురావాలన్న అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. సుప్రీం తీర్పుపై అరుణ్‌కుమార్‌ అగర్వాల్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ఓటర్లు తమ ఓట్లు ఖచ్చితంగా నమోదయ్యాయని ధృవీకరించడానికి అనుమతించవు.  ఓటింగ్‌ యంత్రాలు డిజైనర్లు, ప్రోగ్రామర్లు సాంకేతిక నిపుణుల సాంకేతిక మార్పులకు గురవుతాయి. అందుకే బ్యాలెట్‌ విధానాన్ని అనుమతించాలని, సుప్రీంతీర్పును సమీక్షించాలని పిటిషనర్‌ రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది.