బడ్జెట్ లో ఏ రంగానికి కేటాయింపులు తగ్గింపలేదు

బడ్జెట్ లో ఏ రంగానికి కేటాయింపులు తగ్గింపలేదు

గత బడ్జెట్‌తో పోలిస్తే ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బడ్జెట్‌పై మంగళవారం లోక్‌సభలో సమాధానమిచ్చిన నిర్మల, రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదని ఆమె చెప్పారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా మహమ్మారి అనంతర ప్రభావాలను అధిగమించామని ఆమె వివరించారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన, ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని ఆమె స్పష్టం చేశారు.

“వరుసగా మూడోసారి ఎన్డీఏకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారు. స్థిరత్వం, ప్రజా శ్రేయస్సు విధానాలను తీసుకువస్తున్నాం. వికసిత్‌ భారత్‌ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం. నైపుణ్య శిక్షణ, విద్యా రంగానికి బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేశాం” అని నిర్మల సీతారామన్ తెలిపారు. 

“భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. సబ్‌ కా సాత్‌- సబ్‌కా వికాస్‌ స్ఫూర్తితో బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. కొవిడ్‌ విపత్తు తర్వాత కూడా భారత్‌ వృద్ధి రేటు సాధించింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. బీసీ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని మోదీ ప్రతి రాష్ట్రానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ బడ్జెట్‌లోనూ అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు” అని ఆమె వివరించారు.

గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపులను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్‌, విపక్షాల విమర్శలకు దీటుగా జవాబు చెప్పారు. “2009-10 బడ్జెట్‌లో బిహార్‌, యూపీకి అధికంగా నిధులు కేటాయించారు. నాటి బడ్జెట్‌లో 26 రాష్ట్రాల ఊసేలేదు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15 రాష్ట్రాలు, 2013-14లో 10 రాష్ట్రాలను బడ్జెట్‌లో విస్మరించారు” అని ఆమె గుర్తు చేశారు. 

“నాడు రాష్ట్రాలను విస్మరించి ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. రెండు రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నవారు దానికేం జవాబిస్తారు?” అని చురకలంటించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం బడ్జెట్కు లోక్సభ్ ఆమోదం తెలిపింది.