పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి

పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి
* జమ్మూ – జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు
 
జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి – హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి.  ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.
 
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని… సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని వివరించింది. సహయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సౌత్ ఈస్ట్ రైల్వే డివిజన్‌లోని ఉన్నతాధికారి పేర్కొన్నారు. ముంబయి- హౌరా మెయిల్‌తోపాటు సరుకు రవాణా రైలు కూడా ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశామని, అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపారు.  ఈ రైలు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఈ రైలు ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో సాత్ ఈస్ట్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. ఈ ప్రమాదంపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది.

మరోవంక, జమ్మూ – జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్‌ కాల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రైలును ఆపేసి తనిఖీలు చేపట్టారు. 
 
19926 నంబర్‌ గల ఎక్స్‌ప్రెస్‌ రైలు జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో రైలు పంజాబ్‌ లోని ఫిరోజ్‌పూర్‌ సమీపంలోకి రాగానే ట్రైన్‌లో బాంబు పెట్టినట్లు కొందరు వ్యక్తులు పోలీసులకు ఫోన్‌ ద్వారా బెదిరించారు. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే రైలును కాసు బేగు  స్టేషన్‌లో నిలిపివేశారు. 
 
వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, భద్రతా బలగాలు డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాలతో రైలు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులూ, పేలుడు పదార్థాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రిజిస్టరైన మొబైల్‌ నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.