బ్రెజిల్‌ నుంచి విశాఖ వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ ఏమైంది ?

బ్రెజిల్‌ నుంచి విశాఖ వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ ఏమైంది ?
బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ ఏమైంది ? దానిపై నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ విద్యాశాఖ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మార్చి 20వ తేదీన బ్రెజిల్‌ నుండి 25 కేజీల సంచుల్లో సుమారు 100 బాగ్స్‌ తో రూ. 25 వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ విశాఖపట్నం పోర్ట్‌ కు చేరుకున్నాయని దీనిపై సిబిఐ , ఇంటర్పోల్‌ సంస్థలు `ఆపరేషన్‌ గరుడా’ పేరుతో దాడులు నిర్వహించాయని ఆయన గుర్తు చేశారు. 
 
ఆ సమయంలో అవి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ కి చెందినవిగా పలువురు ప్రచారం చేశారని చెప్పారు. కానీ చివరకు అవి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులకు చెందిన సంధ్యా మెరైన్‌ ఎక్స్పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినవిగా అప్పట్లో అధికారులు ప్రకటించారని,  కానీ ఎన్నికల అనంతరం కూటమి నాయకులు ఈ విషయంపై నోరు మెదపటం లేదని, అధికారులు ఆ కేసు ఏమైందో సమాచారం ఇవ్వడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
 
దీనిపై పార్లమెంట్ లో ఉత్తరాంధ్రకు చెందిన సభ్యులు ప్రశ్న వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనికి రాజకీయ రంగు పులమకుండా చిత్తశుద్ధితో అసెంబ్లీ, పార్లమెంట్లలో నివేదికలకు డిమాండ్‌ చేయాలని కోరారు. నిజంగా విశాఖ మంచి కోరుకునే నాయకులు ఉంటే ఈ దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 
 
ఇదిలా ఉంటే విశాఖలో భూకబ్జాలు, దశపల్లా భూముల అన్యక్రాంతంపై పలువురు ప్రెస్‌ మీట్‌ లు పెట్టి విమర్శిస్తున్నారని చెబుతూ విశాఖపట్నంలో భూ కుంభకోణాలపై టిడిపి గత ప్రభుత్వ హయాంలోనే సిట్‌ ఏర్పాటు చేసిందని దాని నివేదిక బట్టబయలు చేయాలని హితవు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాను పలుమార్లు సిట్‌ నివేదిక బయట పెట్టేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని చెప్పారు. 
 
నిజంగా విశాఖలో భూ ఆక్రమణలుపై నిజాలు నిగ్గు తేల్చాలి అంటే 2004 నుండి ఏర్పాటు చేసిన సీట్‌ ను ఓపెన్‌ చేయాలని విశాఖ కు చెందిన నాయకులు చట్ట సభల్లో మాట్లాడాల్సిన అవసరం ఉందని బొత్స హితవు చెప్పారు. తమ పార్టీ ఎంపి లకు కూడా డ్రగ్స్‌ కేసుపై పార్లమెంట్‌ లో ప్రశ్నించాలని ఇప్పటికె సూచించామని తెలిపారు. అప్పుడే ఇక్కడ ఎవరు దొంగ, ఎవరు దొర అన్న స్పష్టత విశాఖ ప్రజలకు వస్తుందని చెప్పారు.