* వాల్మీకి సంఘం సొమ్ము స్వాహా న్యాయమా సిద్దరామయ్య!
కర్ణాటక హక్కులను తాము ఎప్పుడూ ఉల్లంఘించలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆమె విమర్శించారు. పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి రూ.2లక్షల కోట్లకు పైగా నిధులు సమకూర్చమని చెబుతూ యూపీఏ పాలనలో కేవలం రూ.81 వేల కోట్ల బడ్జెట్‌ను మాత్రమే ఇచ్చిందని ఆమె తెలిపారు.
బెంగళూరులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పా రు. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ఎవరికీ లాభం లేదని అంటూ ఢిల్లీలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో 2004 నుంచి 2014 పదేళ్లలో కర్ణాటకకు రూ.81,791 కోట్లు మాత్రమే అందాయని ఆర్థిక మంత్రి తెలిపారు.
2014 నుంచి 24 మధ్య ప్రధాని మోదీ ప్రభుత్వంలో రూ.2,95,818 కేటాయించిందని చెప్పారు. యూపీఏ కేవలం రూ.60,779 కోట్లను ఎయిడ్ గ్రాంట్‌గా ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పదేళ్లలో రూ.2,39,955 కోట్ల గ్రాంట్ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
బడ్జెట్‌లో ఉపాధి అనే పదాన్ని ఉపయోగించానని చెబుతూ, ఇందులోని ప్రతి అక్షరానికి ఓ అర్థం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ అంటే ఉపాధి అని, ఎం అంటే మధ్యతరగతి అని, ఇలా ప్రతి అక్షరానికి కొంత అర్థం ఉంటుందని ఆమె చెప్పారు. బడ్జెట్‌లో యువత, ఎంఎస్‌ఎంఈలకు పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం రుణం సైతం ఇస్తున్నామని చెబుతూ నేరుగా మధ్య తరగతి కుటుంబాలకు, భారత్‌లో చదువుతున్న యువతకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.
ఇలా ఉండగా, గిరిజన వాల్మీకి సంఘం సొమ్మును స్వాహాచేయడం `న్యాయమా?’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. “ఎన్నికల ప్రచారంలో వారు (కాంగ్రెస్) ‘న్యాయం’ (న్యాయం) గురించి మాట్లాడతారు. ఇది ఎస్సీ/ఎస్టీ వర్గాలకు న్యాయమా?” అంటూ లోక్‌సభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ ప్రస్తావిస్తున్న ‘అబ్ హోగా న్యాయ్’ నినాదం గురించి సీతారామన్ నిలదీశారు.
వాల్మీకి స్కామ్‌లో బ్యాంకుల ప్రమేయం ఉన్నందున కేంద్ర ఆర్థిక మంత్రి బాధ్యత వహించాలంటూ సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సూటిగా నిర్మలా సీతారామన్ స్పందించారు. సిద్దరామయ్య వాస్తవాలను కప్పిపుచ్చి, వాణిజ్య బ్యాంకుల అధికారులు కూడా భాగస్వాములు కావడంతో కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
బ్యాంకుల ప్రమేయం ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే వాల్మీకి స్కామ్‌కు బాధ్యత వహించాలని సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఏమాత్రం బాధ్యత లేకుండా ఆయన మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
”మీ మంత్రి రాజీనామా చేశారు. ప్రైవేటు అకౌంట్లలోకి సొమ్ములు మళ్లించారని మీ వాళ్లే చెబుతున్నారు” అని ఆమె గుర్తు చేశారు. వాల్మీకి కుంభకోణానికి సంబంధించి బ్యాంకు అధికారులపై చర్యలు ఇప్పటికే తీసుకున్నామని, వారిపై తదుపరి చర్యలు కూడా ఉంటాయని ఆమె చెప్పారు. ఎవరినీ తాము కాపాడే ప్రసక్తే ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేయసారు.
వాల్మీకి స్కామ్ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఎవరి పర్వవేక్షణలో ఇది జరిగింది? ఆరోపణలను తప్పించుకునేందుకా? అసలు కుంభకోణం జరగనే లేదని చెప్పేందుకా? అని ఆమె నిలదీశారు. సిద్ధరామయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ డబ్బులు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ అయిన విషయం ఆయనకు తెలియకపోవడం విడ్డూరమని సీతారామన్ విస్మయం వ్యక్తం చేశారు.
అధికారులపై బ్యాకు ఇప్పటికే చర్యలు తీసుకుందని చెబుతూ ఇందులో మంత్రి ప్రమేయం ఏమిటి? ఆర్థిక మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అక్రమంగా నిధుల బదలాయింపు జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోయారు? అని ఆమె ప్రశ్నించారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ కార్పొరేషన్‌లో రూ. 187 కోట్ల కుంభకోణం, రూ. 88 కోట్ల అక్రమ బదిలీకి సంబంధించిన ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
More Stories
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం