ఏపీ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో పది సంవత్సరాలలో 743 అండర్ పాస్‌లు, పైవంతెనల నిర్మాణం జరిగిందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ రైల్వేకు ఇతర భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
రైల్వేకు భూకేటాయింపులపై ఇటీవల చర్చలు కూడా జరిగాయని వివరించారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు మొదలు కానుందని రైల్వే మంత్రి వెల్లడించారు. ఎర్రుపాలెం- కొండపల్లి- నంబూరు మీదుగా రైల్వే లైను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతిఆయోగ్ ఆమోదించిందని తెలిపారు. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై లోక్‌సభలో ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విజయవాడ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.
కాగా, తెలంగాణ రైల్వేకు రికార్డుస్థాయిలో రూ.5,336కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం అని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.32,946 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయని, అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వేస్టేషన్లు ఆధునికీకరించామని తెలిపారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి