నేపాల్ లో వరుసగా విమాన ప్రమాదాలు.. తాజాగా 18 మంది దుర్మరణం

నేపాల్ లో వరుసగా విమాన ప్రమాదాలు.. తాజాగా 18 మంది దుర్మరణం

నేపాల్‌ వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం కూడా నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ఓ ఎయిర్‌క్రాప్ట్‌ కుప్పకూలింది. త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంజిన్‌లో లోపం కారణంగా పొఖారా సిటీలో ఆగిపోయిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రిపేర్‌ చేసేందుకు టెక్నీషియన్స్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇద్దరు సిబ్బంది, 17 మంది టెక్నీషియన్స్‌ ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే గడిచిన 12 సంవత్సరాల కాలంలో నేపాల్‌లో 13 విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 2023 జనవరి 16న జరిగిన ప్రమాదం అత్యంత తీవ్రమైనది. ఆ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గత పన్నేండేళ్లుగా సగటున ఏడాదికి ఒక ప్రమాదం చొప్పున జరుగుతున్నది.

ఈ నేపథ్యంలో ఎందుకు నేపాల్‌లో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ ప్రశ్నకు నిర్వహణా లోపమే కారణమనే సమాధానం వస్తోంది. నేపాల్‌ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో అక్కడ ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ సక్రమంగా లేదు. సరైన మౌలిక సదుపాయాలు లేవు. సిబ్బందికి శిక్షణంగా కూడా నాణ్యంగా లేదు. అందుకే నేపాల్‌లో సగటున ఏడాదికి ఒక్క విమాన ప్రమాదం జరుగుతున్నదని చెప్పవచ్చు.

బుధవారం ఉదయం 11 గంటలకు శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం కాఠ్మాండూ నుంచి పొఖారాకు బయలుదేరింది. రన్వేపై నుంచి టేకాఫ్ అవుతుండగానే ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంతో మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది. ప్రమాదానికి ముందు విమానం కూలుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సయమంలో విమానంలో మొత్తం సిబ్బందితో సహా 19మంది ఉన్నారు. పైలట్ మినహా విమానంలో 18మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 
 
గాయపడిన మరో పైలట్ను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనతో కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో నేపాల్‌తో పాటు అంతర్జాతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడింది.