పోల్ సర్వేల్లో ముందంజలో కమలా హ్యారిస్

పోల్ సర్వేల్లో ముందంజలో కమలా హ్యారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ రంగప్రవేశం చేశారు. ఆమె ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినా ఊహించని రీతిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. 
 
మంగళవారం విడుదలైన ‘నేషనల్ ప్రెసిడెన్షియల్ పోల్’లో ట్రంప్‌ కంటే కమలా హ్యారీస్ ముందంజలో నిలిచారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్ ఖరారైన తర్వాత నిర్వహించిన తొలి పోల్ ఇదే కావడం గమనార్హం.  రాయిటర్స్ పోల్ సర్వేలో ట్రంప్‌పై హ్యారీస్ 2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కమలా హ్యారీస్‌ను 44 శాతం మంది, డొనాల్డ్ ట్రంప్ 42 శాతం మంది తమకు ప్రెసిడెంట్‌గా కావాలని కోరుకున్నారు. 
 
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానంటూ బైడెన్ ప్రకటించిన రెండు రోజుల అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. మునుపటి వారం పోల్‌లో లీడ్‌లో నిలిచిన ట్రంప్ తాజాగా వెనుకబడడం అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మంగళవారమే విడుదలైన మరో పోల్‌లో డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హ్యారీస్ స్వల్పంగా వెనుకబడ్డారు. 
 
అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ స్వీకరించడం, ఇటు బైడెన్ వైదొలగి కమలా బరిలోకి వచ్చిన తర్వాత వెలువడిన ఈ పోల్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు పోల్ ఫలితాల వ్యత్యాసం స్వల్పంగానే ఉండడంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
కమలా హ్యారీస్ రేసులోకి రావడంతో డెమొక్రాటిక్ పార్టీ శ్రేణులు ఆనందపడుతున్నాయి. ఆరోగ్య సమస్యల కారణంగా జో బైడెన్ వెనుకబడడం, ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత ఆయనపై సానుభూతి పెరిగి ఆదరణ భారీగా పెరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కమల హ్యారీస్‌కు పెరిగిన ఆదరణ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం నిర్వహించిన పీబీఎస్ న్యూస్/మారిస్ట్ పోల్‌లోనూ ట్రంప్ 46 శాతంతో కమలా హ్యారీస్ (45 శాతం) కంటే ఆధిక్యంలో నిలిచారు. అయితే 9 శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. మూడవ పార్టీకి చెందినవారు రేసులో చాలా వెనుకబడ్డారు. ఇక ఎన్నికల నుంచి జో బైడెన్ నిష్ర్కమించడం సరైన నిర్ణయమేనని అత్యధిక శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారు.