ఆర్టికల్ 370 రద్దు తర్వాత 900 మంది ఉగ్రవాదులు హతం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత 900 మంది ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఎంతో మంది జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో క్రియాశీలకంగా  ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని, లేదంటే నరకానికే పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ  2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని తేల్చి చెప్పారు.

అదేవిధంగా జమ్మూ కశ్మీర్‌లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి సభకు వివరించారు. ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా రాయ్‌ ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004 – 2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకశ్మీర్‌లో 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగాయని మంత్రి గుర్తు చేశారు. 

ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2014 నుండి ఈ ఏడాది జూలై 21 వరకూ జమ్మూ ప్రాంతంలో 2,259 ఉగ్రవాద ఘటనలు జరిగినట్లు వివరించారు. ఇవి కూడా జరగకూడదని, దురదృష్టవశాత్తు ఉగ్రదాడులు జరిగాయని పేర్కొన్నారు.

 దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని హితవు చెప్పారు. ఇక ఎన్డీయే పాలనలో ఉగ్రవాద సంఘటనలు కూడా 69 శాతం తగ్గినట్లు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజలు ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, భద్రతకు పూర్తి హామీ ఉందని సభలో వివరించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని స్పష్టం చేశారు. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి జులై 15వ తేదీ వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లలో 10 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారని తెలిపారు.

ఇక ఈ ఆర్టికల్ రద్దు తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో శాంతి శకం అరంభమైందని చెప్పారు. అలాగే రాష్ట్రం పురోగామి దిశగా సాగుతున్నందని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులతోపాటు ప్రభుత్వ సంస్థలన్నీ సజావుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే గతంలో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఆందోళనలు, నిరసనలు, బంద్‌లు, రాళ్ల దాడులు నిత్యకృత్యంగా జరిగేవని గుర్తు చేశారు. దీంతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితులు అయితే జమ్మూ కశ్మీర్‌లో లేవని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తిన విషయం మరవరాదని గుర్తు చేశారు.

మరోవైపు జమ్మూ కశ్మీర్‌కు పర్యాటకులు భారీగా భారీ సంఖ్యలో పెరిగారని వివరించారు. అది కూడా 2023 ఏడాదిలో 2.11 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ అందాలను వీక్షించారని విశదీకరించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు సాంఘిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులకు ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల న్యూఢిల్లీలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేసిన విషయం విధితమే.

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుందని సమాచారం. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిందని చర్చ నడుస్తోంది.