రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం

రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం
*సేవ్ డెమోక్రసీ అంటి వైసిపి సభ్యుల  వాకౌట్‌
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని,  ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తూ  రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి, పురోగతికి నోచుకేలదని చెప్పారు.
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం ఏర్పడిందని, రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయామని చెప్పారు. తద్వారా ఆర్థిక నష్టం జరిగిందని పేర్కొన్నారు.  ‘కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి” అని గుర్తు చేశారు. 

అయితే ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయని, చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని చెప్పారు.

విభజన చట్టం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదని, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని గుర్తుచేశారు. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని, భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని చెప్పారు. 

 ప్రాంతం ఆధారంగా ఆస్తులు,  వినియోగం ఆధారంగా విద్యుత్‌ పంపిణీ చేశారని,  ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారని, దానితో ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయామని వివరించారు.  ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు. అయితే, విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయిందని తెలిపారు.

 రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడిందని చెబుతూ అపరిష్కృత సమస్యల వల్ల సవాళ్లు వచ్చాయని గుర్తుచేశారు. విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుందని, సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసిందని చెప్పారు. సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొంటూ 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉందని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయిందని గవర్నర్ గుర్తు చేశారు. ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసిందని చెప్పారు. 

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని గవర్నర్ తెలిపారు. కరవు నివారణ చర్యలు, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ చేపట్టారని, భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారని చెప్పారు. కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారని తెలిపారు. 

చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైందని చెబుతూ  గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముంగించారు. అయితే గవర్నర్‌ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెనకబడిపోయిందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్‌ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయినా గవర్నర్‌ ప్రసంగం కొనసాగడంతో నిరసగా విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.