ఏపీలో ఆటవిక పాలన … దాడులపై ఢిల్లీలో జగన్ ధర్నా

ఏపీలో ఆటవిక పాలన … దాడులపై ఢిల్లీలో జగన్ ధర్నా
పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. రషీద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏపీలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని, ఈ విషయంపై ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామని ప్రకటించారు.  జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. 
 
అనంతరం రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పారు. అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని ప్రకటించారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు.
 
రషీద్ హత్య ఘటనపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. రాజకీయ కక్ష్యతోనే రషీద్ హత్య జరిగిందన్న జగన్ వ్యక్తిగత కారణాలంటూ పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే పుంగనూరులో జరిగిన ఘటనలను సైతం వైఎస్ జగన్ ప్రస్తావించారు.  పుంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే, ఎంపీల పైనా రాళ్లు వేశారని వివరించారు. 
 
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. 300లకు పైగా హత్యాయత్నం ఘటనలు జరిగాయని, 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. వీటితోపాటుగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగిందన్న వైఎస్ జగన్ ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు.