
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో తడిచి ముద్దవుతోంది. గత కొద్ది రోజులుగా వాన జాడ లేక ఆందోళన ఉన్న రైతాంగం వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పెద్దవాగుకు గండి పడటంతో ఏపీ, తెలంగాణల్లో పలు గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మంలోని పెద్దవాగుకు గండిపడటంతో 20గ్రామాలు నీట మునిగాయి.
ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. తరువాత వాయువ్యంగా పయనించి శనివారం ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది.
తమ్మిలేరు వరద వల్ల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరులో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశామని, అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా నమోదు కావడంతో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి సీఎంవో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడడంపై పలు సూచనలు చేశారు.
ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉండటంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు జిల్లాలోని అల్లూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమవ్వగా, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు నగరంలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
విజయవాడలో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో, ఇతర పనుల మీద బయటకు వెళ్లిన వాళ్లు అసౌకర్యానికి గురయ్యారు. ఏలూరు జిల్లాలో కొండ వాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి.రాజమహేంద్రవరంతోపాటు రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జోరుగా వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ