అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం లాంఛనంగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ను ఆమోదించారు. నిజమైన విశ్వాసం, బలం, ఆశలతో కూడిన సందేశంతో పార్టీ ప్రతినిధులు, ప్రజల ముందు నిలబడతానని ఈ సంద్భరంగా ఆయన పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో విఫలం చెందే ప్రసక్తే లేదని, అమెరికా స్వర్ణయుగానికి చేరువలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై హత్యాయత్నం జరిగిన తరువాత అమెరికా ప్రజలు చూపిన ప్రేమకు, మద్దతకు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. తన సంకల్పం చాలా దృఢమైనదని, అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించేదుకు తాను కట్టుబడి ఉన్నాని ట్రంప్ తెలిపారు.
గురువారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో మూడోసారి అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ను అధికారికంగా ఆమోదించిన తరువాత ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. “నేను మీ మద్దతును, భాగస్వామ్యాన్ని, మీ ఓటును వినయంగా అడుగుతున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచను.” అని హామీ ఇచ్చారు.
మరోవంక, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగడంపై ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపే దీనిపై బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతల నుంచే బైడెన్‌కు నానాటీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో బైడెన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.
More Stories
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్