జైలులో కవితకు అస్వస్థత!

జైలులో కవితకు అస్వస్థత!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి  జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గరుయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితకు ఆరోగ్యం పాడవటంతో  జైలు అధికారులు ఆమెను మంగళవారం దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు నెలలుగా జైలులోనే ఉంటున్న కవితకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి.
 
ఆమె కొద్దీ రోజులుగా జ్వరంతో, స్త్రీసంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఆసుపత్రిలో వైద్యుల పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువచ్చారు.  గత కొంతకాలంగా లోబీపీతో బాధపడుతున్న కవిత అరెస్టయిన సమయంలో కూడా అదే సమస్యతో ఉన్నారు. దీంతో వైద్యులు సూచించినట్టుగానే ఇంటి నుంచే మందులు అందిస్తున్నారు. మధ్య మధ్యలో జైలులో వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.
 
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మానీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా కవిత పేరు వినిపించటమే కాకుండా  ఆమెపై కీలక ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
దీంతో పలుమార్లు విచారణ జరిపిన ఈడీ మార్చి 15న కవితను అదుపులోకి తీసుకుంది. కాగా మార్చి 26వ తేదీ నుంచి జ్యూడీయల్ ఖైదీగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం కవిత పలుమార్లు పిటిషన్లు దాఖలు చేయగా ప్రతిసారీ నిరాశే ఎదురవుతూ వస్తోంది. కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించగా, అటు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది.
 
మరోవైపు ఈ కేసులో కవితే ప్రధాన సూత్రదారి, పాత్రదారి అంటూ ఈడీ, సీబీఐ అధికారులు వాదిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి బెయిల్ వస్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామంటూ అధికారులు చేస్తున్న వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ..  రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తోంది. దీంతో నాలుగు నెలలుగా జైలులోనే ఉంటున్నారు కవిత.