విద్యుత్ క‌మిష‌న్ కు కొత్త చైర్మ‌న్‌.. సుప్రీం ఆదేశం

విద్యుత్ క‌మిష‌న్ కు కొత్త చైర్మ‌న్‌.. సుప్రీం ఆదేశం
సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. విద్యుత్​ ఒప్పందాలపై విచారణ కమిషన్​ ఛైర్మన్​ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్​ ఛైర్మన్​ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దానితో కేసీఆర్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
 
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్‌ ఎల్ నరసింహా రెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల వాదనలు వినిపించారు.
 
విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ త‌ప్పుబ‌ట్టారు. ప్రెస్‌మీట్‌లో అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌ర‌చ‌డం స‌రికాద‌ని సీజేఐ ధ‌ర్మాస‌నం పేర్కొంది. కమిషన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. కమిషన్ ఛైర్మన్ న్యాయం చెప్పటమే కాకుండా నిస్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కమిషన్‌ నుంచి నరసింహా రెడ్డిని తప్పించి కొత్త ఛైర్మన్‌ను నియమించాలన్నారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ కొత్త ఛైర్మన్ ఎవరో చెప్పాలని ఆదేశించారు.

లంచ్ అనంతరం విచారణ చేపట్టిన ధర్మాసనం కేసీఆర్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విద్యుత్ కోనుగోళ్లపై జ్యుడీషియల్ విచారణ అనకుండా.. ఎంక్వైరీ కమిషన్‌గా వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. కాగా ధర్మాసనం ఆదేశాల మేరకు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహా రెడ్డి లేఖ న్యాయస్థానానికి రాశారు. 

వచ్చే సోమవారంలోపు కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది. అనంతరం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్ ప్రకటించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో వేసిన కమిషన్ అని కేసీఆర్ తరపున వాదించిన ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో ప్రభుత్వం పరిధిని అతిక్రమించిందని పేర్కొన్నారు.

విద్యుత్ రేగులటరీ కమిషన్ ఉండ‌గా, మ‌ళ్లీ విచార‌ణ క‌మిష‌న్ అవ‌స‌రం లేదని స్పష్టం చేసారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని చెబుతూ పైగా, తాము రాష్ట్ర ప్రభుత్వము నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్‌కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామని కోర్టుకు ముకుల్ రోహ‌త్గీ తెలిపారు.