హైదరాబాద్ ను ఆదివారం రాత్రి ముంచెత్తిన భారీ వర్షం

హైదరాబాద్ ను ఆదివారం రాత్రి ముంచెత్తిన భారీ వర్షం
హైదరాబాద్‌ జంట నగరాలను ఆదివారం రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లు చెరువుల్లా మారాయి. . నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఇదిలా ఉండగా.. నగరంలోని మారేడ్‌పల్లిలో భారీ వాన కురిసింది. 7.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్‌ వెల్లడించింది.
 
హైదరాబాద్ లో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. 
 
మరో గంట సేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిహెచ్ఎంసీ మేయర్‌ జి. విజయలక్ష్మి నగర ప్రజలను విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం టీమ్‌లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, నగర కమిషనర్ ఆమ్రపాలి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
నాళాల వద్ద ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఈవీడీఎం తమ సిబ్బందితో అందుబాటులో ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశఇంచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని ఆమ్రపాలి కోరారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.
కాగా, తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ పేర్కొంది.  ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.