`వాల్మీకి’ కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్ర అరెస్ట్

`వాల్మీకి’ కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్ర అరెస్ట్
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో రూ. 94.73 కోట్ల దుర్వినియోగానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో  కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బి నాగేంద్ర (52)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన్ను శనివారం కోర్టులో హాజరు పరచనున్నామని, అరెస్టు ప్రక్రియ అధికారికంగా జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
ఈ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో నాగేంద్ర తన స్వలాభం కోసం నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. అతడిని అదుపులోకి తీసుకునే ముందు 13 గంటలకు పైగా ప్రశ్నించారు.  ఆయన బళ్లారి రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే.  జూలై 10-12 వరకు ఆయనకు సంబంధించిన అనేక ప్రదేశాలపై దాడులు చేసిన తరువాత, జూలై 12 ఉదయం విచారణ కోసం నాగేంద్రను బెంగళూరులోని శాంతినగర్‌లోని ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
 
మే 26న కార్పొరేషన్‌లోని ఎన్‌. చంద్రశేఖరన్‌ అనే ఉద్యోగి తన ఆత్మహత్య నోట్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకు మంత్రినే కారణమని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వంలో షెడ్యూల్డ్ తెగ సంక్షేమ శాఖ మంత్రిగా నాగేంద్ర కార్పొరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.  కుంభకోణం బహిర్గతం అయిన తర్వాత, మంత్రి పదవికి జూన్ 6న రాజీనామా చేశారు. 
 
మూడు ఏజెన్సీలు- సిట్, సిబిఐ, ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. 11 మందిని అరెస్టు చేసిన సిట్‌  రూ.14.5 కోట్ను స్వాధీనం చేసుకుంది. జూలై 9న, ఈడీ దాడులకు ఒక రోజు ముందు, సిట్ నాగేంద్ర , రాయచూరు రూరల్ నియోజకవర్గం  కాంగ్రెస్ ఎమ్మెల్యే , కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్‌లను విచారించింది. బి.నాగేంద్ర అరెస్ట్‌ నేపథ్యంలో బసనగౌడ దద్దల్‌ అరెస్ట్‌ కూడా ఖాయం అని భావిస్తున్నారు.
 
ఎస్టీ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన పోలీసు ఫిర్యాదు మేరకు కార్పొరేషన్ అధికారులు కొందరు ఫోర్జరీ సంతకాలు చేసి రూ.94,73,08,500 అక్రమంగా వివిధ ఖాతాల్లోకి జమ చేసినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించి కార్పొరేషన్‌కు ఎలాంటి సమాచారం రాలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.