బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని, అయితే రాజీనామా చేసి రావాలని షరతు ఉండటంతో వెనుకడుగు వేస్తున్నారేమోనని వెల్లడించాఛాయారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదని మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. మేనిఫెస్టోల ఇచ్చిన 419 హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూటకట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్‌ అని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్‌ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. గ్లోబల్‌ టెండర్లలో 40 శాతం లెస్‌కు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తాను రాజీనామాకు సిద్ధమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందని మహేశ్వర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. జవాబుదారీతనం లేదని.. పారదర్శకత లేదని విమర్శించారు. పేరుకే ప్రజాపాలన ప్రజాదర్బార్‌ కనరాకుండా పోయిందని తెలిపారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన సాగుతోందని చెప్పారు. రేవంత్‌ బాబా.. డజను దొంగలుగా పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందని మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ప్రజాక్షేత్రంలో అవినీతిని బయటపెడతామని చెప్పారు.