
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3,000 కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శోధ, గజా, కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని చెబుతూ ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తీ కి చెందిన శోధ కంపెనీకి రూ. 400 వందల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చారని వెల్లడించారు.
దీన్ని మూడుగా డివైడ్ చేసి వెయ్యి కోట్లకు ఒక్కరిగా కాంట్రాక్టు ఇచ్చారని, మేఘా కృష్ణారెడ్డికి రూ. 1100 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారని తెలిపారు. అంచనాలు అన్నింటిని కాంట్రాక్టర్లు తయారు చేసుకున్నారని చెబుతూ రూ. 600 కోట్లతో అయ్యే పనికి రూ. 1000 కోట్ల రూపాయలుగా అంచనాలు తయారు చేశారని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లు 30 నుంచి 35 శాతం లెస్ వేసి టెండర్లు దక్కించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదని పేర్కొంటూ టెండర్ డాక్యుమెంట్స్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు.
రహస్య జీవోలతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని వెల్లడించారు.
మొత్తం కలిపి రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరనున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక వైపు జరుగుతున్న జ్యుడిషియల్ విచారణలో ఆ ప్రాజెక్ట్ కు చెందిన మెగా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ చేయకుండా అదే కంపెనీకి మరో రూ 1100 కోట్ల పనులు ఎలా అప్పగిస్తారని మహేశ్వర్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
గత ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలు, టెండర్లపై విచారణకు సిద్ధమా? అని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. హెటిరో డ్రగ్స్ భూమి విషయంలోనూ, సివిల్ సప్లై అవినీతిపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మరోవంక, కొడంగల్ ప్రాజెక్టు కూడా మెగా కృష్ణారెడ్డికే అప్పగించబోతున్నారని బిజెపి నేత తెలిపారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?