
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో సమీక్షంచారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, అదనపు డీజీ మహేష్ కుమార్ భగవత్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఛీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, జీఏడీ అధికారులు హాజరయ్యారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, రామచందర్నాయక్ కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండడంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా స్పీకర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాతనే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండడంతో అందుకు తగ్గట్లు అధికారులు సిద్ధం కావాలని సూచించారని సమాచారం.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆర్థికాంశాల గురించి మంత్రి జూపల్లికృష్ణారావు గురువారం సమీక్షించారు. ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, సాయంత్రం వరకు కొనసాగింది.
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ఎన్ని రోజులు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ముఖ్యమైన రైతు భరోసా పథకంపైనా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే, జాబ్ క్యాలెండర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?