
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిలపై విజిలెన్స్ విచారణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిలు పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా, విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదులు ఇచ్చాయి.
ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయగా, కేంద్రంలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెనక్కు వచ్చారు. దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
శ్రీవాణి టిక్కెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని, టీటీడీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. సమాచార శాఖలో ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది.
ఇటీవల ధర్మారెడ్డి, టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై అధికార కూటమి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీకి లబ్ది చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారని తెలిపారు. ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయని లేఖలో పేర్కొన్నారు.
మరోవంక, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే శ్రీవారి దర్శనంకోసం తిరుమల వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళణను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే 40 మంది విజిలెన్సు అధికారుల బృందం తిరుమలలో దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాంట్రాక్టులు జారీచేశారని, అందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వెలువడ్డాయి.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు