
విభజన సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాలరావు, సీఎస్ శాంతికుమారి, మరో ఇద్దరు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, సీఎస్ నీరబ్‌కుమార్, మరో ఇద్దరు సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర పాల్గొన్నారు. 6.10 గంటలకు ప్రారంభమైన ముఖ్యమంత్రుల సమావేశం 8 గంటల వరకు (సుమారు రెండు గంటలు) జరిగింది.
సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో అనేక విభజన అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా పదేండ్లుగా పరిషారానికి నోచుకోని అంశాలను త్వరగా చర్చించుకొని ముందుకుపోవాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించినట్టు మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. విభజన చట్టంలోని సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిషారం దొరుకుతుందని తాము భావించలేదని తెలిపారు.
సమస్యల పరిషారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, రెండు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రెండు రాష్ర్టాల విభజన సమస్యల పరిషారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులతో కూడిన ఇరు రాష్ట్రాల నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రెండు వారాల్లో ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిషార మార్గాలు చూస్తారని వెల్లడించారు. ఉన్నత స్థాయి అధికారులు పరిషారం చూపలేని అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ కసరత్తు చేసి పరిషార మార్గాలు కనుగొంటుందని చెప్పారు.
మంత్రుల స్థాయిలో పరిషారం కనుగొన్న సమస్యలకు సీఎంలు ఆమోదం తెలుపుతారని చెప్పారు. ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో పరిషారం కాని సమస్యలకు ఇరు రాష్ట్రాల సీఎంలు పరిషార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు భట్టి తెలిపారు.
విభజన అంశాల పరిష్కారానికి రెండు రాష్ర్టాల సీఎంలు ఒకచోట చర్చించటం తెలుగు జాతి ఆనందించే మంచి రోజు అని ఏపీ మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. సమావేశంలో అందరి సలహాలు, సూచనలు తీసుకొని, అన్ని అంశాలపై లోతుగా చర్చించామని తెలిపారు. అనేక పోరాటాలతో నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో తెలంగాణ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు.
ఎవరి సెంటిమెంట్లు, మనోభావాలు దెబ్బతినకుండా, అందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే రోజుల్లో అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ, సీఎంల భేటీలు మరిన్ని జరుగుతాయని తెలిపారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు